కిరణ్ పాలనకు మూడేళ్లు
=సీఎంగా జిల్లాకు అందని వరాలు
=చివరి నిమిషంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన
=జిల్లాలో అధ్వానంగా రోడ్ల పరిస్థితి
=కదలని గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు
=చలికాలంలోనూ తాగునీటికి ట్యాంకర్లే గతి
=పెండింగ్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
సాక్షి, చిత్తూరు: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి మూడేళ్లు అయ్యింది. ఈ కాలంలో ఆయన సొంత జిల్లాకు చేసిందేమీ లేదని చెప్పవచ్చు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గ ఓటు బ్యాంక్‌ను పదిలపరుచుకునేందుకు అనుసరించిన మార్గంలోనే కిరణ్ సైతం నడిచారు. ఆయన తన సొంత నియోజకవర్గం పీలేరుకు నిధులన్నీ తరలించడం, అక్కడ కాంట్రాక్టర్లకు కాసులు రాలే విధంగా పనులు ఇవ్వడం మినహా జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించినది ఏమీలేదు. పీలేరు పట్టణం చుట్టుపక్కల కొండలు, గుట్టలనూ వదలకుండా భూబకాసురులు కబ్జా చేశారు.
ముందుకు సాగని పనులు
జిల్లాకు సాగునీటి వనరులు లేవు. పడమటి మండలాల్లో రైతులు 1000 నుంచి 1500 అడుగుల వరకు బోర్లు వేసి అరకొర నీటితో పంటలు పండిస్తున్నారు. పశ్చిమాన హంద్రీనీవా, తూర్పున గాలేరు నగరి ప్రాజెక్ట్‌లు పూర్తయితే కృష్ణా మిగులు జలాలతో చిత్తూరు జిల్లా సాగుభూములు సస్యశ్యామలమవుతాయి. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లు భూసేకరణ, నిధుల కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. హంద్రీనీవాకు సంబంధించి మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల్లో కాలువలు తవ్వి వదిలేశారు.
వీటిని చెరువులతో అనుసంధానించడం, ఎత్తిపోతల పథకాల ద్వారా అనంతపురం జిల్లా నుంచి కృష్ణా జలాలు అందించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షానికి ఈ కాలువలో నిలిచిన నీటితో రైతులు సంతృప్తి పడాల్సి వస్తోంది. గాలేరు నగరి కాలువకు సంబంధించి వైఎస్సార్ జిల్లాలో టన్నెల్ తవ్వకం, రేణిగుంట, పుత్తూరు, వడమాలపేట, ఆర్.సి.పురం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, చెరువుల అనుసంధాన పనులు ప్రారంభం కాలేదు. కాలువల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. అక్కడక్కడా కాలువలు తవ్వి వదిలేశారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు అవసరమైన నిధులు విడుదల కాలేదు.
కడప, అనంతపురం జిల్లాల్లో పనులకు నిధులు విడుదల చేసి గాలేరు-నగరి, హంద్రీనీవాకు నిధులు ఇచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి మూడేళ్లలో ఒక అడుగూ ముందుకు పడలేదు. జిల్లాలో వెయ్యికిపైగా చెరువులను అనుసంధానించి వర్షాకాలంలో వీటిల్లోకి పుష్కలంగా నీరు చేరే విధంగా వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ను సీఎం కిరణ్ పక్కన పెట్టేశారు. మైక్రో ఇరిగేషన్ కింద చేపట్టిన ఈ పథకం నిధుల కేటాయింపు, సరైన పర్యవేక్షణ లేక పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం కట్టలు, తూముల మరమ్మతులకు మాత్రం నిధులు విడుదల చేశారు.
అధ్వానంగా రోడ్లు
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో కొత్తగా వేసిన రోడ్లు ఏమీలేవు. పలమనేరు-క్రిష్ణగిరి, రాణిపేట-పలమనేరు నేషనల్ హైవేలతోపాటు నాయుడుపేట-పూతలపట్టు స్టేట్ హైవే గుంతలమయంగా మారింది. పలమనేరు నేషనల్ హైవేను నాలుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు భూసేకరణ పనులు ప్రారంభం కాలేదు. తిరుపతి-పీలేరు-మదనపల్లె రోడ్డు నిర్మాణం చేపట్టినా అది పూర్తి కాలేదు. చిత్తూరు- తిరుపతి రహదారి అధ్వానస్థితిలో ఉంది. ఈ మార్గంలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అవసరం. ఈ ప్రతిపాదనలు మూడేళ్లుగా మోక్షం లేదు. మొత్తం మీద సీఎం కిరణ్ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటికి కటకట
జిల్లాలో నేటికీ 17 మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. చివరి నిమిషంలో హడావుడిగా శంకుస్థాపన చేసిన రూ.7,200 కోట్ల కండలేరు మంచినీటి పథకం ప్రధానంగా పీలేరు దాహార్తిని తీర్చే విధంగా డిజైన్ చేశారు. అక్కడ నుంచి పడమటి మండలాలకు తాగునీరు ఇస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ సమస్యగా ఉంది. ఇది ఎన్నికల ప్రచారం కోసం వాడుకునేందుకు మిగిలింది. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న పీలేరు పట్టణంలోనూ ప్రజలు బిం దె నీటిని రూ.4 చెల్లించి కొనుక్కుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది. చిత్తూరు, తిరుపతి, పుంగనూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల్లోనూ జనం చలికాలంలో సైతం తాగునీటికి కటకటలాడుతున్నారు.
కిరణ్ పాలనకు మూడేళ్లు
Published Tue, Nov 26 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement