సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాగూ దిగిపోతారని, అది తెలిసే పదవి తనకు లెక్క కాదన్నట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావం సందర్భంగా శనివారం జేఏసీ కార్యాలయంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా సంపూర్ణ తెలంగాణ వచ్చేదాకా పోరాటం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమన్నారు. జేఏసీ ముఖ్యనేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు మాట్లాడుతూ హైదరాబాద్, భద్రాచలం సహా ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమైక్య పాలకుల వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు
సమైక్యరాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్య, వివక్షా పూరిత విధానాలే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణమని కోదండరాం ఆరోపించారు. ‘తెలంగాణ రైతు రక్షణ సమితి’ ఆవిర్భావ కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఇందులో కోదండరాం ప్రసంగించారు. తెలంగాణకు సాగునీటి వసతి కల్పించకపోగా విద్యుత్ చార్జీలను పెంచారని, ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వకుండా తెలంగాణ రైతులను వేధించారని సమైక్య పాలకులపై కోదండరాం మండిపడ్డారు. సీపీఐ నేతలు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, కిసాన్ మోర్చా నాయకుడు సుగుణాకర్ రావు, టీఎన్‌జీవోల నేత దేవిప్రసాద్ ఈ సదస్సులో ప్రసంగించారు.