గిరిజనుల ఆరాధ్యదైవం, మన్యం వీరుడు కొమురం భీమ్ 73వ వర్ధంతి శుక్రవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగింది.
ఆసిఫాబాద్/రెబ్బెన/జైనూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల ఆరాధ్యదైవం, మన్యం వీరుడు కొమురం భీమ్ 73వ వర్ధంతి శుక్రవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగింది. ఈ ఏడాది భీమ్ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. లోగోను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా జోడేఘాట్‌లోని భీమ్ సమాధి వద్ద గిరిజన సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నివాళులర్పించారు. గిరిజనులు, అభిమానులు భారీగా తరలిరావడంతో జోడేఘాట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. భీమ్ మనవడు సోనేరావు ఆధ్వర్యంలో సమాధి వద్ద పూజలు చేసి గిరిజనుల నాలుగు గోత్రాల జెండాలను ఎగుర వేశారు. అనంతరం గిరిజనులు, ఐటీడీఏ అధికారులు భీమ్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జోడేఘాట్‌లో గిరిజన దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా భీమ్ మనవడు సోనేరావు దంపతులకు వర్ధంతి కమిటీ తరఫున దుస్తులు బహూకరించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకురాలు విమలక్క, గిరిజన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉట్నూర్ ఆర్డీవో రామచంద్రయ్య, తెలంగాణ ప్రజాఫంట్ అధ్యక్షుడు వేదకుమార్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, వర్ధంతి కమిటీ చైర్మన్ సిడాం శంభు, కన్వీనర్ ఆత్రం లక్ష్మణ్, గిరిజన సంఘాల నాయకులు మడావి రాజు, ఉయిక సంజీవ్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావు, టీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవ లక్ష్మి, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, గిరిజన నాయకులు సిడాం అర్జు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, రాష్ట్ర టూరిజం శాఖ అధికారి ముఖేశ్, స్త్రీ విముక్తి రాష్ట్ర కన్వీనర్ కరుణ, జిల్లా కన్వీనర్ ఆత్రం సుగుణ వేలాది మంది గిరిజనులు, అభిమానులు జోడేఘాట్ తరలివచ్చారు.
పోలీసులు అడ్డుకోవడంపై గిరిజన సంఘాల ఆగ్రహం
కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌కు తరలివస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను పోలీసులు హట్టిలోనే అడ్డుకోవడంపై గిరిజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం అధికారులు లేని దర్బార్‌లో సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని భీమ్ మనవడు సోనేరావు, వర్ధంతి కమిటీ చైర్మన్ సిడాం శంభు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జోడేఘాట్‌లోని భీమ్ సమాధి వద్ద నివాళులర్పించేందుకు శుక్రవారం వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హట్టిలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ అహ్మద్ బాబు, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జనార్దన్ నివాస్, ఎంపీ రాథోడ్ రమేశ్, టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, బోథ్ ఎమ్మెల్యే గొడం నగేశ్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావులతోపాటు పలువురు ప్రముఖులు భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దర్బార్ వెలవెల
భీమ్ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినా మొక్కుబడిగా నిర్వహించిందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.మూడు రోజుల క్రితం జోడేఘాట్‌లో కలెక్టర్, ఐటీడీఏ పీవో వర్ధంతి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు లేని భద్రతా సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దర్బార్‌కు ఎవ్వరూ వచ్చినా, రాకపోయినా కలెక్టర్, ఐటీడీఏ పీవో వస్తే సమస్యలు తెలుపొచ్చు. వారే రాకపోతే సమస్యలు ఎవరికి తెలుపాలని మండిపడుతున్నారు. దీంతో దర్బార్ అధికారులు లేకపోవడంతో వెలవెలబోయింది. సమస్యలు తెలుపడం కోసం జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాది మంది గిరిజనులు సభకు తరలి వచ్చి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. జోడేఘాట్‌కు అధికారులను రానివ్వకపోవడం, హట్టికే పరిమితం చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు 12 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఈ యేడాది 1/70తోపాటు పలు సమస్యలు తెరపైకి తెచ్చేందుకు గిరిజనులు సిద్ధమయ్యారు. అధికారులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు జోడేఘాట్, హట్టిలో నిరసనలు వ్యక్తం చేశారు. వర్ధంతినే సక్రమంగా నిర్వహించని ప్రభుత్వం గిరిజనులకు హక్కులు ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భీమ్ వర్ధంతి పురస్కరించుకొని జోడేఘాట్‌లో శుక్రవారం గిరిజన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలు, ఆదివాసీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మధ్యాహ్నం ప్రారంభమైన దర్బార్ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాట్లు చేశారు.