నగరంలో జరిగిన గ్యాస్ విస్ఫోటనం దృశ్యం (ఫైల్)
గోదావరి గలగలలు.. స్వాగతం పలికే ఏటిగట్లు.. కొబ్బరి చెట్లు.. ఇలా అడుగడుగునా ప్రకృతి సోయగాల నిలయం కోనసీమ ప్రాంతం. ఇప్పుడీ అందాల సీమ గత కొన్నేళ్లుగా గ్యాస్ లీకేజీలవల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటోంది. తరచూ ఓఎన్‌జీసీ, గెయిల్‌లకు చెందిన గ్యాస్ పైపులైన్ల లీకేజీలు.. కాలం చెల్లిన పైపులైన్లతో ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని దినదినగండంలా బతుకుతోంది. కొత్త బావుల అన్వేషణకు వేల కోట్లు ప్రైవేటు సంస్థలకు ధారపోస్తున్న ఆయిల్ సంస్థలు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన పైపులైన్ల పునరుద్ధరణకు మాత్రం ముందుకు రావడంలేదు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఉభయగోదావరి, కృష్టాజిల్లా పరిధిలో విస్తరించి ఉంది. మూడు జిల్లాలో దాదాపు 600 బావులు తవ్వారు. వీటిలో ప్రస్తుతం 110 గ్యాస్, 43 ఆయిల్ బావులు మాత్రమే పనిచేస్తు న్నాయి. జిల్లాల్లో మోరి, అడవిపాలెం, పొన్నమండ, కేసనపల్లి దక్షిణం, కేసనపల్లి తూర్పు, పాసర్లపూడి, ఎండమూరుల్లో గ్యాస్ కలెక్టింగ్ సెంటర్లు (జీసీఎస్) ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో 710కి.మీ.మేర పైపులైన్లున్నాయి. ఇందులో 90 శాతం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాజమహేంద్ర వరం అసెట్ రోజుకు 816 మెట్రిక్ టన్నుల ఆయిల్, 2.839 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా కేసవదాసుపాలెం (మోరీ) జీసీఎల్ పరిధిలోని పైపులైన్లు తరచూ లీక్ అవుతున్నాయి.
ఓఎన్జీసీ పనిలా...
భూగర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తుంది. ఆయిల్‌ను మాత్రమే ఈ సంస్థ శుద్ధిచేసి విక్రయిస్తుంది. ఆయిల్ నుంచి గ్యాస్‌ను విడగొట్టి గెయిల్‌కు విక్రయిస్తుంది.
గెయిల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) పనిలా...
ఈ సంస్థ ఓఎన్జీసీ నుంచి చమురు కొనుగోలు చేసి దేశంలోని వివిధ పవర్ ప్రాజెక్టులకు, ఎరువులు తదితర భారీ ఫ్యాక్టరీలకు ప్రత్యేక పైప్‌లైన్లను వేసి గ్యాస్‌ను విక్రయిస్తుంది. కేజీ బేసిన్‌లో గెయిల్ పైప్‌లైన్లు, ఓఎన్జీసీ పైప్‌లైన్లు వేర్వేరుగా ఉంటాయి.
నగరం ఘటనతో వణికిపోతున్న జనం...
కోనసీమలోని నగరం గ్రామంలో 2014 జూన్ 27న గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం జరిగింది. అక్కడ నుంచి విజయవాడ సమీ పంలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు సరఫరా చేసే సహజ వాయువు పైప్‌లైన్ పేలిపోయింది. ఈ భారీ విస్ఫోటంలో 22 మంది మత్యువాత పడగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతటి ప్రమాదం మరోసారి జరగకపోయినా దాని ఆనవాళ్లు తరుచూ లీకేజీలతో బయటపడుతున్నాయి.
నిపుణులు ఏమంటున్నారంటే..
ఓఎన్‌జీసీ బావుల ద్వారా ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువు నిక్షేపాలను గ్యాస్ కలెక్టింగ్ స్షేషన్ (జీసీఎస్)లకు తరలించేందుకు నాలుగు అంగుళాల పరిమాణం కలిగిన పైప్‌లైన్లు వేస్తారు. పైపు పైభాగంలో రబ్బర్ కోటింగ్‌తో కూడిన పేపర్‌ను చుట్టి భూ అంతర్భాగంలో రెండు మీటర్ల లోతులో ఏర్పాటుచేస్తారు. ఇలా వేసిన పైపులు 30 ఏళ్లు పనిచేయాల్సి ఉండగా కేవలం 20 ఏళ్లకే పాడైపోతున్నాయని ఓఎన్‌జీసీ నిపుణులు చెబుతున్నారు. అలాగే, బావుల నుంచి నిక్షేపాల పరిమాణం తగ్గిపోవడంతో ఇసుక వస్తోందని, దీనివల్ల పైపులు కోతకు గురవుతున్నాయంటున్నారు. భూమిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండడం కూడా పైపులు త్వరగా పాడైపోవడానికి ఒక కారణం కావచ్చని చెబుతున్నారు. అలాగే, రైతులు ట్రాక్టర్లతో దున్నడం.. దమ్ము చేయడం కూడా పైపులు పాడైపోవడానికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.
ఇవీ లోపాలు..
- బావులకు గతంలో సెక్యూరిటీ గార్డులుండేవారు. ఇప్పుడీ వ్యవస్థను రద్దు చేయడంతో ఎక్కడేం జరుగుతుందో తెలియడంలేదు. బావుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుచేసి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం జనసంచారం ఉన్న చోట పైపులైన్లు వేయకూడదు.
- లీకేజీ చోటుచేసుకున్నప్పుడు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ అందుబాటులో లేదు. అదే విదేశాల్లోనైతే ఎక్కడికక్కడ లాకింగ్ సిస్టమ్‌ను పక్కాగా అమలుచేస్తున్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించగలుతున్నారు.
- అధికారుల పర్యవేక్షణ సరిగ్గా ఉండటంలేదు. సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉంది. తరుచూ తనిఖీలు చేయడంలేదన్న విమర్శలున్నాయి. పాడైన పైపులైన్లు వెంటనే గుర్తించడంలేదు. పైపులైన్ల నుంచి కొన్నిచోట్ల ముడిచమురు చోరీ జరుగుతోంది.
మమ్మల్ని పట్టించుకోలేదు
నగరం పేలుడులో తీవ్రంగా గాయపడ్డా. నాతోపాటు మా కుటుంబంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు పరిహారం ఇచ్చారు. నాకు నాలుగున్నర నెలలపాటు గెయిల్ ఆధ్వర్యంలోనే చికిత్స అందించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. తదుపరి ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. గెయిల్ ఇచ్చిన ఐదు లక్షలతోపాటు అదనంగా మరో రూ.2.25 లక్షలు ఖర్చయింది. ఇళ్లు దెబ్బతిన్నందుకుగాను పరిహారం ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ గెయిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా.
– బోనం పెద్దిరాజు, నగరం
సాయం కోసం
పేలుడు సంఘటనలో నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మామయ్య వెంకటేశ్వర రావు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద కొడుకు వెంకట కృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. రెండు చేతులు సరిగ్గా పనిచేయడంలేదు. చేతులకు అపరేషన్ గురించి పట్టించుకోలేదు. ఆపరేషన్‌కు అయిదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంత స్థోమత మాకు లేదు. గెయిల్ వారే ఆ ఖర్చు భరించాల్సి ఉంది. దీంతోపాటు పిల్లలకు చదువు చెప్పిస్తామన్నారు. దరఖాస్తు చేసినా ఫలితం లేదు.
– వానరాశి దుర్గాదేవి, బాధితురాలు.. పక్కన వెంకటకృష్ణ
అమలుకు నోచుకోని హామీలు...
- 27 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకున్న నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ చేసిన వాగ్దానం నేటికీ అమలుకు నోచుకోలేదు.
- రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులపాటు రెండు విడతలుగా చేసిన ఇంటింటి సర్వేను ఇంతవరకూ అమలుచేయలేదు.
- ‘నగరం’లో కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్ ఏర్పాటుచేస్తామన్న హామీకి మోక్షం కలగలేదు.
- స్థానికంగా ఉన్న పీహెచ్‌సీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు.
- నగరం ఘటనలో బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్కరికీ చేయలేదు. గాయపడ్డ వారికీ ఆర్థిక సాయం పూర్తిస్థాయిలో అందలేదు.
నగరం ఘటన తర్వాత ప్రధాన లీకేజీలు..
- మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లో 2015లో ఓఎన్‌జీసీ బావి లీకైంది. ఇదే మండలం గొల్లపాలెంలో 2016 నవంబరులో ముడి చమురు పైపు పేలింది. 2017 ఫిబ్రవరిలో తూర్పుపాలెం డ్రిల్లింగ్ బావిలో బ్లోఅవుట్ ప్రమాదం తృటితో తప్పింది.
- రాజోలు మండలం వేగివారిపాలెంలో ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ లీకైంది.
- సఖినేటిపల్లి మండలం మోరిలో గత ఏడాది గ్యాస్ పైప్‌లైన్ పేలింది.
- ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అంతర్వేదికరలోని ఓఎన్జీసీ సైటులో కేవీ 5, 20 బావులకు సంబంధించిన ఉమ్మడి పైపులైను తుప్పుపట్టి కేశవదాసుపాలెం వరిచేలో భారీగా గ్యాస్ ఎగజిమ్మింది. అదే ప్రాంతంలో కేవీ 13, 14 బావుల పైపు లైను నుంచి గ్యాస్‌తో కూడిన చమురు ఎగజిమ్మింది. అంతర్వేదికరలోని కేవీ 15 బావికి చెందిన పైపులైను నుంచి కేశవదాసుపాలెంలో వరిచేలో గ్యాస్ ఎగిసిపడింది.
- గతనెల 23న అంతర్వేదికరలోని కేవీ 49–4 నంబర్ బావి నుంచి మోరి జీసీఎస్‌కు సరఫరా చేస్తున్న పైపు నుంచి కేశవదాసుపాలెంలో గ్యాస్ లీకైంది. అదే నెల 28న అంతర్వేదికర గ్రామంలో ఓఎన్జీసీ వెల్ నం.11 వద్ద సుమారు రెండు గంటలపాటు గ్యాస్ లీకైంది.
- ఈ నెల 4న కేశవదాసుపాలెంలో మోరి జీసీఎస్ సమీపంలోని కేవీ 22 బావి నుంచి గ్యాస్‌ను సరఫరా చేస్తున్న పైపు ద్వారా గ్యాస్ లీకైంది.
- కేశవదాసుపాలెం చేలో ఉన్న పైపు నుంచి రెండు గంటలపాటు గ్యాస్‌తో కూడిన చమురు ఎగజిమ్మింది. నెలకోసారి చొప్పున ఇక్కడ గ్యాస్, ముడి చమురు లీకవుతున్నా పట్టించుకోవడంలేదు. ఇలా ఇంకా అనేకం సంఘటనలు జరుగుతున్నా పైపులైన్ల లీకేజీని నియంత్రించే చర్యలు కనిపించడం లేదు.
ప్రధాన కారణాలివే..
- ప్రస్తుతం గ్యాస్, ఆయిల్ సరఫరా అవుతున్న పైపులైన్లలో చాలావరకూ 20 ఏళ్ల క్రితం వేసినవే. సాధారణంగా పదేళ్లకోసారి పైపులైన్లు మార్చాల్సి ఉంది. తుప్పు పట్టినా చూసీచూడనట్టు వదిలేస్తున్నారే తప్ప మార్చేందుకు ప్రయత్నించడంలేదు.
- ఇక పైప్‌లైన్లు దెబ్బతినడానికి మరో ప్రధాన కారణం.. ఆయిల్, గ్యాస్ సరఫరా చేసే పైపులలో నీరు ప్రవహించడం. దీన్నివల్ల పైపులైన్లు వేగంగా తుప్పుపట్టి పోతున్నాయి. ఆయిల్, గ్యాస్‌తోపాటు వచ్చే నీటిని అదుపుచేయడం సాధ్యపడటంలేదు. అందుకుతగ్గ సాంకేతిక నైపుణ్యంతోపాటు పైపులైన్ల పర్యవేక్షణకు సంబంధించిన పరికరాలూ ఈ సంస్థల వద్ద లేవు.
- గల్ఫ్ వంటి దేశాలలో సుమారు 20 అడుగుల లోతులో, 6 మీటర్ల వెడల్పున స్థలాన్ని సేకరించి పైపులు వేస్తారు. ఆ స్థలంలో రైతులు, స్థల యజమానులు ఎటువంటి పనులు చేపట్టకుండా గట్టి భద్రతా చర్యలుంటాయి. కానీ, మన దేశంలో కేవలం మూడు నుంచి నాలుగు అడుగుల లోతునే పైప్ లైన్లను, అదీ నివాస ప్రాంతాల మీదుగా కూడా వేసినట్టు తెలుస్తోంది. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment