కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్‌లోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డి దొంగదీక్ష చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ విమర్శించారు. బుధవారం విశాఖ జిల్లా నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు అసెంబ్లీలో తీర్మానానికి నిరాకరించారని ఆరోపించారు. టీబిల్లు అసెంబ్లీకి వచ్చాక ఓటింగ్ పెట్టాలని వైఎస్సార్‌సీపీ కోరితే పట్టించుకోకుండా కేవలం చర్చకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు.
సమైక్యవాణి వినిపించేందుకు ప్రధానాస్త్రాలైన ఈ రెండు డిమాండ్లను పక్కన పెట్టి టీబిల్లులో లొసుగులు ఉన్నాయంటూ వెనక్కి పంపడం సిగ్గుచేటన్నారు. కిరణ్, చంద్రబాబులు తెలుగు జాతిని మోసం చేస్తున్నారన్నారు. సీఎం ఢిల్లీ డెరైక్షన్‌లో నడుస్తున్నారని ఆయన చేసే ప్రతిపని సోనియా ఆదేశాల మేరకే అన్నారు. సవరణ చేయకుండా టీబిల్లును కేంద్రం పార్లమెంట్లో ఆమోదిస్తే సీఎం పద వికి రాజీనామా చేస్తాననడం సిగ్గుచేటన్నారు. మరో 40రోజుల్లో ఎన్నికలొచ్చి ఊడిపోయే పదవికి రాజీనామా ఎవడికి కావాలన్నారు. సమైక్యాంధ్రపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన వెంటనే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.