విభజన తర్వాత అన్నీ కష్టాలే..!
Published Mon, Jun 5 2017 4:58 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ
విజయనగరం పూల్‌బాగ్ : రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయిందని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఆది నుంచి అన్ని ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తూ, అభివృద్ధిని పక్కన పెట్టేశాయని పేర్కొన్నారు. లక్షలాది ప్రజలు కూలి కోసం వలస బాట పడుతున్నారని, దీనికి కేవలం పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఆరోగ్యం, పర్యాటకం, విద్యుత్ శక్తి, పరిశ్రమలు, పారిశుద్ధ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఉత్తరాంధ్ర వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. విద్యాభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్న విషయం బహిరంగానే తెలుస్తుందన్నారు. బుందేల్ ఖండ్, కోరాపుట్, బోలంగీర్, కలహాండి తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందించాలని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, విమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీల మేధావులను పిలిచి ఈ నెల 25న చర్చావేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 నుంచి ఆగస్టు 15 వరకు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ కోలగట్లను కలిసిన కొణతాల
విజయనగరంమున్సిపాలిటీ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం చేపడుతున్న చర్చావేదికలో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా కోరుతూ మాజీ మంత్రి, చర్చవేదిక నాయకుడు కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామిని కోరారు. ఆదివారం విజయనగరానికి వచ్చిన కొణతాల కోలగట్లను కలిసి తర్వాత మాట్లాడారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని, ఇక్కడి ప్రజల వెనుకబాటుతనం, ఆకాంక్షల పేరిట ముద్రించిన కరపత్రాలను కోలగట్లకు అందించారు. ఆ సమయంలో మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, వల్లూరి ప్రకాష్‌బాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement