మోదీకి కొణతాల లేఖ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొణతాల రామకృష్ణ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ఏడాది మే నెలలో తాను రాసిన లేఖ గురించి ప్రస్తావించిన ఆయన అప్పటికీ ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్ధితులు మారలేదని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కేవలం రాజధాని అమరావతిపైనే తన దృష్టిని కేంద్రీకరించి మిగిలిన జిల్లాలను వదిలేసిందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూనుకోకపోతే ప్రాంతాల మధ్య బేధాలు పెరుగుతయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటన్నింటి అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. ఏపీ అభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. కరెన్సీ నోట్ల రద్దులో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు ఉందని చెప్పారు.
రాష్ట్రానికి హోదా కన్నా ప్యాకేజి సరిపోతుందని కొందరు చెబుతున్నారని ఆ మాటలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవిధంగా పోరాడుతున్నారో స్ధానిక మీడియా ద్వారా తెలుసుకోవాలని కోరారు.