రాజధాని..దుఃఖదాయని | Kondaveeti Vagu the development of shaken by | Sakshi
Sakshi News home page

రాజధాని..దుఃఖదాయని

Published Sat, Apr 2 2016 12:52 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

రాజధాని..దుఃఖదాయని - Sakshi

రాజధాని..దుఃఖదాయని

కొండవీటి వాగు అభివృద్ధిపై నీలినీడలు  
ఏటా వరదలతో రైతులకు కన్నీరు పెట్టిస్తున్న వైనం  
ప్రతిపాదనలు.. శంకుస్థాపనలకే పరిమితం

 
కమ్మనైన అమ్మలాంటి భూమాత ఒడిలో చెమట చుక్కలు చిందించి..ఆమె మోముపై పంట సిరులు పండించి.. ప్రపంచం ఆకలి తీర్చే రైతన్న..నేడు కళ్ల ముందే తన కష్టం కొండవీటి వాగు రూపంలో కరిగిపోతుంటే..కనికరించే నాథుడు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాడు..ఆనకట్ట తెగి ముంచెత్తే వరదలో నాయకుల హామీలు కొట్టుకుపోతుంటే..కొంగొత్త ఆశలతో అభివృద్ధి రెక్కలు తొడుక్కుంటున్న రాజధాని కొండవీటి వాగు సాక్షిగా దు:ఖదాయనిగా మారిపోతోంది.  
 
తాడికొండ రూరల్ : ఫిరంగిపురం మండలం కొండవీడు కొండల్లో నుంచి ప్రారంభమై మేడికొండూరు మీదుగా తాడికొండ మండలంలో ప్రవేశించే కొండవీటి వాగు తుళ్లూరు మండలంలోని కోటేళ్ల వాగు, అయ్యన్న వాగులను కలుపుకొని ఉగ్రరూపం దాల్చుతుంది. అక్కడ నుంచి తాడేపల్లి వద్ద సీతానగరం మీదుగా కృష్ణా 29.65 కిలోమీటర్ల మేర ప్రవహించి నదిలో కలుస్తుంది. అయితే నీటి ప్రవాహ వేగం కృష్ణానదిలో ఎక్కువగా ఉన్న సమయంలో వరద నీరు వెళ్లే దారి లేక వెనక్కి నెట్టడంతో వాగు కట్టలు తెంచుకొని పంట పొలాలపైకి నెట్టుకొస్తుంది. దీంతో ఏటా వేలాది ఎకరాలు నీటి పాలవుతున్నాయి.

గత కొన్నేళ్లుగా వాగుకు కనీస మరమ్మతులు చేసే నాథుడు కరువవడంతో కుంచించుకుపోయింది. దీంతో వరద నీరు పూర్తి స్థాయిలో దిగువకు వెళ్లే పరిస్థితి లేదు. పలుమార్లు వరదల పాలైన పంటలను రాష్ట్ర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు, కేంద్ర బృందాలు పర్యటించి  నివేదికలు అందజేసి చేతులు దులుపుకున్నారు.


 హామీలు.. శంకుస్థాపనలు..
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వాగు సర్వే చేరుుంచి నిధులు మంజూరు రాబట్టారు. 24-11-2013న రూ. 49.70 కోట్లతో కొండవీటి వాగు ఆధునికీకరణ పథకానికి ఎంపీ రాయపాటితో కలిసి శంకుస్థాపన చేశారు. తరువాత హడావుడిగా పనులు మొదలు పెట్టి కొంత మేరకు మట్టి తొలగింపు కార్యక్రమం కొనసాగించినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది. నాటి నుంచి పట్టించుకున్న నాథుడు లేడు.

 నేటి పరిస్థితి ఇదీ..
తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత కొండవీటి వాగును సింగపూర్‌లా మారుస్తాం..వాగుకు ఇరువైపులా కట్టల ఎత్తుపెంచి  వెడల్పు చేయడంతో పాటు ఒడ్డుకు ఇరువైపులా రహదారులు నిర్మించి వంతెనలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. పూల మొక్కలను పెంచడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మారుస్తామంటూ గొప్పలు చెప్పారు.  

ప్రణాళికలు కూడా ....
కొండవీటి వాగు ద్వారా వచ్చే వరద నీటిని తాడికొండ మండలం లాం వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి 2 టీఎంసీలు, నీరుకొండ వద్ద 5 టీఎంసీలు, తుళ్లూరు మండలం వడ్డమాను వద్ద 3 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అవి కాస్తా కాగితాలకే పరిమితం కావడంతో ఇంత వరకూ అసలు ఏం జరగనుందో రైతులకు అర్థం కావడం లేదు.

 ఉద్యోగులు వస్తే ఏంటి పరిస్థితి ?
ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న ఐనవోలు గ్రామంలోని 70 శాతం పంట పొలాలు కొండవీటి వాగుకు వరద వస్తే మునిగిపోతాయి. మరో 3 నెలల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తి చేసి  ఉద్యోగులను ఇక్కడకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. కొండవీటి వాగు పొంగితే ఈ ప్రాంతమంతా మునిగి ఉదోఓయగులు ఇబ్బందులు పడక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement