వివేకా నోరు అదుపులో పెట్టుకో
మైనార్టీల నేతల హెచ్చరిక
నాయుడుపేటటౌన్: ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడడం మంచి పద్ధతి కాదని మైనార్టీ సంఘాల నాయకులు అన్నారు. స్థానిక జామీయా మసీదులో బుధవారం మధ్యాహ్నం మసీదు ముత్తవల్లీ, నాయకులు ఆనం వివేకానంద రెడ్డి తీరుపై తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా జామీయా మసీదు ముత్తవల్లీ హాజీ రంతుల్లా సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలో ఆనం విచిత్ర వేషాధారణలతో ఆయన చేసే జిమిక్కిలు ప్రజలకు తెలుసన్నారు. అయితే పవిత్ర మాసంలో ముస్లీంలను కించపరిచేలా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఆయన ఉనికి చాటుకునేందుకే టీడీపీలోకి చేరారని, అయితే ముస్లిం నేతను కించపరిచేలా విమర్శించి కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పది సంవత్సరాలు కార్పొరేషన్ అతని చేతిలో ఉండిందని ఎంత మేరకు అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలకు స్పష్టంగా తెలుసు అన్నారు. హాజీ గఫూర్ సాహెబ్ మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో ముస్లీం ఓటర్లతో గెలిచి నేడు వారిని విమర్శించేలా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టుకోకపోతే జిల్లాలోని ముస్లింలు అందరు ఏకమై పెద్ద ఎత్తున్న ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.