టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేష్
ఆదిలాబాద్ రూరల్: తెలుగుదేశం పార్టీతోనే తనకు గుర్తింపు వచ్చిందని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు వివిధ పదవులు చేపట్టడం జరిగిందని టీడీపీని వీడే ప్రసక్తే లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తానన్నారు.
పార్టీని బలోపేతం చేయడానికి ఏప్రిల్‌లో గ్రామ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు యూనుస్ అక్బాని, అన్నపూర్ణ, రాజిరెడ్డి, రితేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.