
‘కొత్తగూడెం’ మూత!
జెన్‌కోకు చెందిన కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీఎస్) కొన్నేళ్లలో పూర్తిగా మూతపడనుంది. 2018 నుంచి ఒక్కో యూనిట్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేస్తూ.. 2023 నాటికి ప్లాంట్ మొత్తాన్నీ మూసివేయనున్నారు. ఈ మేరకు జెన్‌కో పాలకమండలి అంతర్గత సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణలో తగ్గిపోనున్న
740 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఆధునీకరించి, నాణ్యమైన
బొగ్గు సరఫరా చేస్తే.. ప్లాంట్లు
కొనసాగించవచ్చనే అభిప్రాయాలు
ఇంకా దిక్కులేని 800 మెగావాట్ల
కొత్త ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: జెన్‌కోకు చెందిన కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీఎస్) కొన్నేళ్లలో పూర్తిగా మూతపడనుంది. 2018 నుంచి ఒక్కో యూనిట్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేస్తూ.. 2023 నాటికి ప్లాంట్ మొత్తాన్నీ మూసివేయనున్నారు. ఈ మేరకు జెన్‌కో పాలకమండలి అంతర్గత సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మూసివేత ఫలితం గా తెలంగాణ ప్రాంతంలో 740 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోనుంది. దాంతో విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే 2,000 మెగావాట్ల విద్యుత్‌కు కొరత ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో.. ఇది మరింత కష్టం కలిగించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కేటీపీఎస్ వద్దే 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించినా.. ఇప్పటివరకూ మోక్షం లభించలేదు. ఆ కేంద్రం కోసం ఇప్పటికీ కనీసం టెండర్లను పిలవకపోవడం గమనార్హం.
మూసివేత ఎప్పుడు?: కేటీపీఎస్‌లోని వివిధ యూనిట్లలో 1966-71 మధ్య విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. సాధారణంగా కేటీపీఎస్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 20 నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ప్రాజెక్టుల్ని ఆధునీకరిస్తే.. మరో ఐదు నుంచి పదేళ్ల పాటు వినియోగించవచ్చు. వాస్తవానికి కేటీపీఎస్ ఏ, బీ, సీ విద్యుత్ కేంద్రాలను మూసివేసే ప్రతిపాదనేదీ తొలుత జెన్‌కో వద్ద లేదు. అయితే ఈ ప్లాంట్ల కాలపరిమితి ముగియడంతో పాటు పరిమితికి మించి కాలుష్యాలను వెదజల్లుతోందని కేంద్ర పర్యావరణ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కాలపరిమితి మించిన ఈ యూనిట్లను ఎప్పుడు మూసివేస్తారనే విషయాన్ని తెలపాలంటూ గతేడాది సెప్టెంబర్ 26న జెన్‌కోకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. దానికి అనుగుణంగా ఈ ప్లాంట్లను రానున్న 5 -10 ఏళ్లలో మూసివేయాలని ఆగస్టులో జరిగిన జెన్‌కో అంతర్గత పాలకమండలి సమావేశం తీసుకుంది.
120 మెగావాట్ల చొప్పున సామర్థ్యమున్న రెండు యూనిట్లు ఉన్న కేటీపీఎస్-బీ స్టేజ్‌తో పాటు అంతే సామర్థ్యమున్న సీ-స్టేజ్ స్టేషన్‌ను 2018లో (ఐదేళ్ల తర్వాత) మూసివేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 4 యూనిట్లు ఉన్న కేటీపీఎస్-ఏ స్టేషన్‌ను పదేళ్ల తర్వాత అంటే 2023లో మూసివేయనున్నారు. మొత్తంగా 740 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు మరింత విద్యుత్ కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ఇప్పటికే 100 కోట్లకుపైగా వెచ్చించినట్లు సమాచారం. అంతేగాక పాత ప్లాంట్లు అయినా.. నాణ్యత కలిగిన బొగ్గు సరఫరాచేస్తే పర్యావరణ కాలుష్య సమస్య తీరడంతోపాటు కేటీపీఎస్‌లో సామర్థ్యం మేరకు విద్యుత్‌నూ ఉత్పత్తి చేయవచ్చనే భావన ఇంధనశాఖలో వ్యక్తమవుతోంది.