గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించింది. కాసులకు కక్కుర్తి పడి నిర్మాణాలు లోపభూయిష్టంగా చేస్తున్నారన్న ప్రజల గగ్గోలు, ప్రతిపక్షాల ఆరోపణలు ‘నీరు పల్లానికి ప్రవహిస్తుంది’ అన్నంత నిజమని తేలుతోంది. దేశంలోనే అతిపెద్ద ఘాట్‌గా గొప్పగా చెపుతున్న రాజమండ్రి కోటిలింగాల ఘాట్ నిర్మాణం పూర్తి కాకుండానే బయటపడ్డ లోపాలే ఇందుకు తిరుగులేని రుజువుగా నిలుస్తున్నారుు.
కంబాలచెరువు (రాజమండ్రి) : పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటిలింగాలఘాట్‌ను భారీగా విస్తరించి కోటిలింగాలపేట నుంచి నల్లా చానల్ వరకు 1.2 కిలోమీటర్ ఘాట్ నిర్మించారు. దీని నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ తరుణంలో నల్లా చానల్ వద్ద కనకదుర్గ ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన ఘాట్‌కు దన్నుగా కట్టిన గోడ శనివారం పగులు తీసింది. అది కొంత మేర కుంగి, ఏ క్షణాన్నరుునా కూలిపోయే అవకాశం ఉంది. అంతేకాక ఘాట్ కిందభాగంలో గుల్లలా ఏర్పడడంతో అది కూడా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనికి కారణం నిర్మాణ సమయంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమేనని తేటతెల్లమవుతోంది.
కన్నుతెరవకపోతే.. పెనుముప్పే..
శుక్రవారం రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కోటిలింగాలపేట, ఆర్యాపురం, తుమ్మలావ, సీతంపేట, లింగంపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ఆ నీటిని గోదావరిలోకి పంపేదిశగా నల్లాచానల్ వద్ద పైప్‌లైన్‌ను ఆన్ చేశారు. నీరు గోదావరిలోకి వెళ్లే క్రమంలో ఒడ్డున కోతకు గురై, ఘాట్‌కు దన్నుగా నిర్మించిన గోడ పగిలిపోయింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వేలమంది భక్తులు ఒకేసారి గోదావరి నదిలోకి స్నానాలుచేసేందుకు దిగుతారు. అటువంటప్పుడు ఆ బరువును తట్టుకోలేక నదిలోకి కుంగిపోతే ఎంత పెను ప్రమాదం జరుగుతుందో ఊహించడానికే భయం పుడుతుంది. కాగా ఇక్కడే గోదావరి గట్టుపై వర్షాలకు పెద్ద ఊలకన్నం పడి, నీరు బిరబిరా లోపలికి పోతోంది. ఆ కన్నం నుంచి పోయే నీరు అడుగున ఎక్కడ, ఏ మేరకు డొల్ల చేస్తుందో తెలియదు. ఆ డొల్లతనం ఘాట్ కిందే అయితే అది మరోముప్పు అని చెప్పక తప్పదు.
దేశంలోనే పెద్ద ఘాట్ నిర్మించామని చంకలు గుద్దుకుంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. పనుల్లో నాణ్యతాలోపాన్ని పట్టించుకోకపోవడానికి.. పుష్కరపనుల్లో వరదలెత్తుతున్న అవినీతే కారణమ న్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా.. మేలుకుని, జరిగిన పనుల్లో లోపాలను చక్కదిద్దడానికి, జరుగుతున్న పనులు నాణ్యతతో జరగడానికి యుద్ధప్రాతిపదికన పూనుకోవాలి. అప్పుడే.. పావనపర్వాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్న మాటకు సార్థకత ఉంటుంది.
కాగా గోడ పగిలిన తెలుసుకున్న మేయర్ పంతం రజనీశేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ మురళి, ఇరిగేషన్ ఎస్‌ఈ సుగుణాకరరావు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణరుుంచారు.
పరాకాష్టకు చేరిన అవినీతికి నిదర్శనం..
పుష్కర పనుల్లో పరాకాష్టకు చేరిన అవినీతికి నిదర్శనం నల్లాచానల్ వద్ద స్నానఘట్టం గోడ పగిలి, కుంగిపోవడమేనని వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఘాట్ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ఘాట్ నిర్మాణం మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా అలా కాక ఇష్టారాజ్యంగా చేశారన్నారు. కాంక్రీట్, ఐరన్ ఊచలు వాడిచేయాల్సిన పనులను ఎక్కువ ఇసుకతో చేశారన్నారు. ఈ ఘాట్ నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందే మాటల్లో చెప్పలేమన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని వేయాలని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడుతామన్నారు. ఆయన వెంట ఆదిరెడ్డి వాసు, ఇసుకపల్లి శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, వాకచర్ల కృష్ణ, నాధన్ ఉన్నారు.