
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం రాత్రి వరకు ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన కృష్ణా బోర్డు శ్రీశైలం, సాగర్‌లో లభ్యతగా ఉన్న 33 టీఎంసీల నీటిని తెలంగాణ, ఏపీలకు పంచింది. తెలంగాణకు 17, ఏపీకి 16 టీఎంసీల నీటిని కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 6 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 10 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు ఒక టీఎంసీ కేటాయించింది. ఇక ఏపీకి కేటాయించిన నీటిలో హంద్రీనీవాకు 1 టీఎంసీ, సాగర్ కుడి కాల్వకు 7, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 4 టీఎంసీలు కేటాయించింది.
రాత్రి వరకు చర్చలు
శ్రీశైలం, సాగర్‌లో లభ్యతగా ఉన్న జలాలు, ఇరు రాష్ట్రాల అవసరాలు, నీటి పంపిణీపై చర్చించేందుకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం ఇక్కడి జలసౌధలో భేటీ అయింది. దీనికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతోపాటు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ తరఫున ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లభ్యత జలాలపై ముందుగా చర్చించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 816.9 అడుగుల మట్టంలో 36.52 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 810 అడుగులకు ఎగువన కేవలం 9.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని ఇరు రాష్ట్రాలు బోర్డుకు తెలిపాయి. ప్రస్తుతం 13,600 క్యూసెక్కుల మేర నీటి వినియోగం జరుగుతున్నందున మరొక వారం రోజుల్లో ప్రాజెక్టు ఖాళీ అవుతుందని వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సాగర్ నీటిపై ఆధారపడాల్సి ఉంటుందని ఏపీ తెలిపింది. అయితే దీనిపై తెలంగాణ స్పందిస్తూ.. సాగర్‌లో ప్రస్తుతం 522.2 అడుగులకు ఎగువన 153.32 టీఎంసీల లభ్యత ఉండగా, 15వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందని, కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 24 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపింది. మే చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లేది లేదని, లభ్యతగా ఉన్న నీటిని సర్దుబాటు చేయాలని కోరింది.
గతంలో కేటాయించిన 9.4 టీఎంసీల కన్నా 1.6 టీఎంసీల మేర ఏపీ అధికంగా వాడిందని తెలంగాణ పేర్కొంది. ఇక తమకు కేటాయించిన 24 టీఎంసీల్లో 7.26 తక్కువగా వాడినట్లు కమిటీ దృష్టికి తెచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లభ్యత జలాల్ని పంచాలని కోరింది. దీనికి ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత వినియోగాన్ని పక్కనపెట్టి లభ్యతగా ఉన్న నీటినే పంచాలని కోరింది. చివరికి రాత్రి 9 గంటల సమయంలో కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు నీటిని పంచింది.
Comments
Please login to add a commentAdd a comment