'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని'
హైదరాబాద్ : కృష్ణా-గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నందునే కృష్ణా-గుంటూరు మధ్యే రాజధానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రాజధానికి 30 టీఎంసీల తాగునీటిని సమకూర్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ నీటిని రప్పించేందుకు కృషి చేస్తున్నామని నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముంపు సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఆగస్ట్ 10వ తేదీలోపు నివేదిక ఇవ్వనుంది.