శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో శనివారం గోకులాష్టమి సందర్భంగా గో పూజలను నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని నిత్య సేవతో పాటు గోశాలలో 11గోవులకు,11 గోవత్సాల(ఆవుదూడలు)కు శ్రీసూక్తం, గో అష్టోత్తర మంత్రం, గోవులకు షోడశ ఉపచార పూజలను అర్చకులు, ఈఓ సాగర్‌బాబు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత వేదపరాయణలు జరిగాయి. పూజల అనంతరం నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర విశేషపూజలను చేశారు. మన వేదసంస్కృతిలో గోవులకు ఎంతో విశేషస్థానం ఉందని, మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు తదితరవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయని వేదపండితులు తెలిపారు.
గోవు 33 కోట్ల దేవతలకు ఆవాస స్థానం కావడంతో గోపూజ వలన 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని ఈఓ తెలిపారు. గోపూజను ఆచరించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని, జగన్మాత లలితా పరమేశ్వరి గోవు రూపంలో భూమిపై సంచరిస్తుందని లలితా సహన్రామం తెలియజేస్తుందని వేద పండితులు పేర్కొన్నారు. తాను చేసిన ప్రతి పనిలో వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీకృష్ణపరమ్మాత ఆవుల మందలు అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి గోవులను కాసి గోపాలునిగా పేరుగాంచి గోవు యొక్క అనంత మహిమను లోకానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయంగా వస్తుందన్నారు.
శ్రీశైలంలో ఘనంగా గో పూజ
Published Sat, Sep 5 2015 5:30 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement