♦ ఫారెస్ట్, టాస్క్‌ఫోర్సు భద్రతా దళాల తనిఖీలు
♦ ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం వేట
సాక్షి, తిరుమల : శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 7వ తేదీన శేషాచల పరిధిలోని శ్రీవారిమెట్టు ప్రాంతంలో టాస్క్‌ఫోర్సు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది కూలీలు తప్పించుకుని పారిపోయినట్టు టాస్క్‌ఫోర్సు దళాలు చెబుతున్నాయి. అంతకుముందే 2 వేల మంది దాకా ఎర్రచందనం చెట్లను నరికే కూలీలు శేషాచలం నలుమూలలా తిష్టవేసినట్టు టాస్క్‌ఫోర్సు, ఫారెస్ట్ విభాగాలకు సమాచారం ఉంది. ఈ మేరకు టాస్క్‌ఫోర్సు, అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని శేషాచలంతో పాటు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, కర్నూలు జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు.
కాల్పుల ఘటన తర్వాత చిత్తూరు రేంజ్, తిరుపతి రేంజ్, మామండూరు రేంజ్ పరిధిలో భారీగా ఎర్రకూలీలతో పాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఎన్‌కౌంటర్ ఘటనతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూంబింగ్‌లో రోజువారీగా పట్టుబడుతున్న కూలీలు, స్మగ్లర్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరవేస్తూ వారి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. శేషాచలంలో మరికొన్ని రోజులపాటు కూంబింగ్ నిర్వహించాలని రాజధాని నుంచి ఫారెస్ట్, టాస్క్‌ఫోర్సుకు ఆదేశాలందాయి.
శేషాచలంలో కూంబింగ్
Published Wed, Apr 15 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement
Advertisement