విజయనగరం కంటోన్మెంట్: వర్షాలు కుర వడం లేదనే భావన రైతుల్లో రాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వ్యవసాయం, ఉద్యాన పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన తాగునీరు, సాగునీరు, ర్యాగింగ్, విత్తన సరఫరా, టోల్‌గేట్ల నిర్మాణం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండిస్తున్న పంటలు నష్టపోకుండా ఉండేలా చూడాలన్నారు.
అవసరమైతే వ్యవసాయ బోర్ల ద్వారా సాగునీటిని అందించాలని ఆయన తెలిపారు. ప్రతి మండలంలోనూ చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోచ్చన్నారు. సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, క్రిమి సంహారక మందులు, అవసరమైన పనిముట్లను అందించాలన్నారు. బోర్ల ద్వారా నీరు అందించడమే కాకుండా వారికి అండగా ఉండి ధైర్యం కల్పించాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, మరమ్మతులకు గురయిన రక్షిత మంచినీటి పథకాలు, బోర్లను త్వరితగతిన రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు దగ్గరలోనే నీటి వనరులు కల్పించే విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రా దావరా మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు.
ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని, కఠినంగా వ్యవహరించాలన్నారు. ర్యాగింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై ఆమె మాట్లాడుతూ 1997 ర్యాగింగ్ చట్టం ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష, ఎక్కడైనా చదువుకునేందుకు అర్హత లేకుండా చేస్తామన్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన ర్యాగింగ్ కమిటీ తరచూ రివ్యూ చేసి పర్యవేక్షించాలన్నారు. ర్యాగింగ్ చట్టంపై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ బి.రామారావు, డీఆర్వో జితేంద్ర, డ్వామా పీడీ ప్రశాంతి, సీపీఓ బి.మోహనరావు, డీఎంహెచ్‌ఓ యు స్వరాజ్యలక్ష్మి, పశుసంవర్థక జేడీ వై సింహాచలం ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాలు లేవన్న భావన రాకూడదు
Published Thu, Aug 6 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement