సీఎం నివాసం సక్రమమైతే.. కూలీల ఇళ్లూ సక్రమమే
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నివాసం సక్రమమైతే పుష్కర ఘాట్లలో కూలీ నాలీ చేసుకునే ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు సక్రమమేనని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం పుష్కరఘాట్లలో కోర్టును ఆశ్రయించిన బాధితులను కలిసేందుకు ఆయన సీతానగరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రే కృష్ణానది ఒడ్డున ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన నివసిస్తున్న ఇంటికి తన పేరుపై పన్నులు కూడా చెల్లించడం లేదన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నివసించే గిరిజనులు, మత్స్యకారులు 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ సక్రమంగా నివాసం ఉంటున్నారని అన్నారు. అధికారం ఉందని ముఖ్యమంత్రి కృష్ణా ఒడ్డున నివసిస్తుంటే సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించే పేదవారికి ఎంత హక్కు ఉంటుందో అధికారులు గమనించాలని ఆర్కే సూచించారు.
కోర్టు స్టే విధించిన విధంగా అధికారులు మెలగకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ కార్యదర్శి గోరేబాబు, బీసీ నేత ఓలేటి రాము, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, యువజన నాయకులు మహేష్, కౌన్సిలర్లు లక్ష్మి, దర్శి విజయశ్రీ, పార్టీ నాయకులు కొల్లి చంద్ర, మేకా వెంకటరామిరెడ్డి, విశ్వనాధరెడ్డి, అంబటి రఘు పాల్గొన్నారు.