కొండపి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇప్పటి వరకు లక్ష 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించినట్లు జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ ధనుంజయుడు తెలిపారు. అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొండపి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. 2006లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 36 వేల ఇళ్లు మంజూరు చేయగా... లక్షా 72 వేల మంది ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించుకున్నారన్నారు. 30 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ఐదో స్థానంలో ఉందని చెప్పారు.
జిల్లాలో కారంచేడు, చినగంజాం, చీమకుర్తి, మద్దిపాడు, జే పంగులూరు, కొండపి మండలాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండగా..దోర్నాల, త్రిపురాంతకం, అర్ధవీడు, మర్రిపూడి మండలాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మంది ఎస్సీలు ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 150 కేజీల ఇనుము సైతం అందించే అవకాశం ఉందన్నారు.
లబ్ధిదారులు 11 డిజిట్‌తో కూడిన ఆన్‌లైన్ అకౌంట్లనే ప్రారంభించుకోవాలన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సిమెంటు డబ్బులు దశలవారీగా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 50 శాతం పురోగతి సాధించలేని హౌసింగ్ అధికారులకు కలెక్టర్ మెమోలు ఇచ్చినట్లు చెప్పారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 41 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టాలు తీసుకుని గ్రౌండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.