indiramma house constructions
-
అంతులేని అవినీతి
‘ఇందిరమ్మ’ అవకతవకలపై విచారణ ముమ్మరం వెలుగు చూస్తున్న అక్రమాలు ఊరూరా లక్షల రూపాయలు స్వాహా! నారాయణఖేడ్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, ఆక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హౌసింగ్‌శాఖలో అవినీతి భారీగా జరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఓ అంచనా కోసం జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని నాలుగు గ్రామాల్లో సీబీసీఐడీ అధికారులు మొదటి విడతగా విచారణ చేపట్టారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో రెండు సార్లు సీబీసీఐడీ అధికారులు బృందాలుగా వెళ్లి ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై లబ్ధిదారులు, హౌసింగ్ అధికారులు, ఇతరులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలోని కేరూర్, నాగులపల్లి, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో శేరిదామరగిద్ద, ఖేడ్ మండలంలోని పంచగామ గ్రామపంచాయతీ పరిధిలో విచారణ జరిపారు. లక్షల్లో అవినీతి సీబీసీఐడీ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో దాదాపు ప్రతి గ్రామంలో లక్షల్లో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పంచగామ గ్రామ పంచాయతీ పరిధిలో హౌసింగ్ శాఖలో రూ.1.35 కోట్లతో 419 ఇళ్లు మంజూరుకాగా, అందులో 176 ఇళ్ల పేరిట అక్రమార్కులు రూ.47 లక్షలను బిల్లుల రూపంలో స్వాహా చేశారు.తెల్ల రేషన్‌కార్డులు లేకుండా కొందరి పేర్ల మీద, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కొందరి పేర్ల మీద ఇళ్లు మంజూరు అయినట్టు అధికారులు గుర్తించారు. పూర్తి విచారణ చేపట్టిన అధికారులు రూ.47 లక్షల వరకు అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈమేరకు సీబీసీఐడీ అధికారులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనూరు మండలం శేరిదామరగిద్దలో 506 ఇళ్లు మంజూరు కాగా, అందులో రూ.25.92 లక్షలు అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా ఇటీవల నారాయణఖేడ్‌లోని డీసీసీబీ బ్యాంకులో ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు సేకరించారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు 2004 నుండి 2014 వరకు హౌసింగ్ శాఖలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టడంతో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొదట జిల్లాలోని నాలుగు గ్రామాల్లోనే విచారణ జరుగుతున్నా, మిగితా గ్రామాల్లో అవినీతికి పాల్పడ్డ వారు కూడా ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు, పైరవీకారులు ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. హౌసింగ్ అధికారులు, కింది స్థాయి సిబ్బందితో పాటు నేతల అండదండలతో ఇష్టారీతిగా హౌసింగ్‌శాఖ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు చెల్లించే క్రమంలో కూడా లంచాల పేరిట కొంత డబ్బు కాజేసినట్లు సీబీసీఐడి అధికారులు గుర్తించారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల అవకతవలపై విచారణ జరుగుతున్న తరుణంలో అవినీతి అధికారులు, నాయకులకు గుబులు పట్టుకుంది. ఏదిఏమైనా పూర్తి స్థాయి విచారణ జరిగి హౌసింగ్‌శాఖ అవినీతి బట్టబయలు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఇందిరమ్మ’పై మరోసారి సీఐడీ విచారణ
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. గతం లో విచారణ సమయంలో ఇళ్లకు తాళాలు వేసిన వారు, బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారి ఇళ్ల ను ఈ సందర్భంగా పరిశీలించారు. ఇలా 60 ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ అధికారులు 7 బృందాలుగా విడిపోయి ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు మంజూరైన విషయం తమకు చెప్పకుండానే దళారులు బిల్లులు డ్రా చేశారని డీఎస్పీకి విన్నవించారు. ఇంటి పొజిషన్, రేషన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ పరిశీలన, డబ్బులు, బస్తాలు ఎన్ని అందాయని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తప్పవు.. ఇందిరమ్మ అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ అన్నారు. అక్రమాలపై విచారణ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆయన వెంట సీఐలు విజయ్‌కుమార్, కరుణసాగర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వరావు, రహమాన్, మధుసూదన్‌రెడ్డి, సీఐడీ సిబ్బంది, హౌసింగ్ డీఈ రవీందర్, ఏఈ రామచంద్రు, వర్క్ఇన్స్పెక్టర్లు వెంకన్న, దేవేందర్, రవి పాల్గొన్నారు. -
‘గూడు’కట్టుకున్న భయం
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రుణాలు మాఫీ చేస్తారని రైతులు, మహిళలు.. పెన్షన్లు పెంచుతారని వృద్ధులు, వికలాంగులు.. కొత్తగా ఉద్యోగాలు ఇస్తారని యువకులు.. ఇందిరమ్మఇళ్ల బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ఇలా ఒక్కరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు అనుక్షణం కలలుగన్నారు. అయితే ప్రభుత్వం తీరుతో అందరిలోనూ గుబులు పట్టుకుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా.. ఒక్కో పథకాన్ని ఎత్తివేస్తూ అప్పుల పాలు చేస్తుందా అని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే కోవలోనే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బి.కొత్తకోట: కొత్త రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖకు పనిలేకుండా పోయింది. కొత్తప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందని భావిస్తే పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో మండల స్థాయిలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. నాలుగు నెలలుగా నిర్మాణాలు అటకెక్కినా, 9 వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం.. లాగ్ఇన్ ఇస్తే నిధులభారం పడుతుందని గృహనిర్మాణ శాఖ వైపు కన్నెత్తి చూడడంలేదు. మరోవైపు అనర్హుల పేరుతో ఇళ్లను రద్దు చేసే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయి. దీంతో ఇందిరమ్మ పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈ పథకం మునుపటిలా పరుగులు పెడుతుందా? లేక నిధులు ఇవ్వకుండా దశలవారీగా నీరుగార్చేలా చేస్తారా? అన్నది అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి పనిలేకుండాపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే జిల్లాలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధి దారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇప్పటికే జరి గిన నిర్మాణాలకు చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయే అధికారులే చెప్పలేని పరిస్థితు లు. దీంతో అప్పులు చేయ డం ఎందుకని లబ్ధిదారులు పనులు ఆపేశారు. జిల్లా వ్యాప్తంగా 4,43,009 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 2,95,134 ఇళ్లను పూర్తిచేశారు. 31,900 ఇళ్లు పునాదులు, 2,130 ఇళ్లు గోడల స్థాయిలో,13,170 ఇళ్లు రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 ఇళ్ల ఇంతవరకు ప్రారంభించనే లేదు. ఈ గణాంకాలు మే 24 నాటివి కాగా రూ.1236.2 కోట్లను ఇందిరమ్మ నిర్మాణాల కోసం ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. సిమెంటు సరఫరా నిలిపివేత ప్రభుత్వం జిల్లాకు సిమెంటు సరఫరాను నిలిపివేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం జిల్లా వ్యాప్తంగా 28 గోదాములను గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ వేల టన్నుల సిమెంటు నిల్వలు ఉండాల్సింది. ప్రతి నెలా సిమెంటు కర్మాగారాల నుంచి సిమెంటు సరఫరా అవుతుంది. అయితే ఏప్రిల్ నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో తక్షణమే నిర్మాణాలు ప్రారంభిస్తే లబ్ధిదారులకు అవసరమైన సిమెంటును పంపిణీ చేయలేరు. 28 గోదాముల్లో ప్రస్తుతం 2,500 టన్నుల సిమెంటు నిల్వలు ఉన్నాయి. మార్చి 23 నుంచి బిల్లులు లేవు జిల్లాలోని ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు మార్చి 23వ తేదీ నుంచి బిల్లులు మంజూరు కాలేదు. అంతకు ముందు ఆన్లైన్లో ఉంచిన బిల్లులకు మాత్రమే చెల్లిం పులు జరిగాయి. నాలుగు నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9 వేల బిల్లులు పెండింగ్‌లో ఉండగా వీరికి రూ.15.66 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్లులు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే అధికారులు తెల్లమొహం వేస్తున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు.. ఇక బిల్లుల గురించి ఏం చెప్పగలమంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల రద్దుకు నివేదికలు సిద్ధం జిల్లాలో 15,600 ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సబ్డివిజన్లలో పనిచేస్తున్న డీఈ స్థాయి అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నారు. జిల్లాలో 1,00,671 ఇళ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉండగా అందులో 15,600 మందిని అనర్హులుగా గుర్తించారు. జిల్లాలోని 18 సబ్ డివిజన్లకు చెందిన ఈ లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పైకి అధికారులు ఏమీ చెప్పకపోయినా ప్రభుత్వం నిర్ణయం ఇదేనని స్పష్టమవుతోంది. లాగ్ ఇన్ ఇస్తే నిధులు ఇవ్వాల్సివస్తుందని.. గృహనిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించాలంటే డీఈలు చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం శాఖాపరంగా నిర్వహిస్తున్న ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఉంచాలి. ఇలా ఉంచాలంటే ఆన్లైన్ వివరాలు నమోదు చేసేందుకు డీఈలకు లాగ్ఇన్ పాస్వర్డ్ ఇవ్వాలి. అది ఇచ్చాక అధికారులు బిల్లుల కోసం లబ్ధిదారుల వివరాలను ఇచ్చాక వెంటనే బిల్లుల సొమ్మును లబ్ధిదారుని ఖాతాకు చెల్లించాలి. అయితే ఇప్పటికిప్పుడే గృహనిర్మాణాలకు సంబంధించిన లాగ్ఇన్ ఇస్తే వెనువెంటే నిధులభారం పడుతుంది. ఈ ఒక్క జిల్లాలోనే రూ.15.66 కోట్లు పెండింగ్ ఉంది. దీంతో పాటు పేరుకుపోయిన నమోదుకాని ఇళ్ల బిల్లులు ఇంకా కోట్లలోనే. దీంతో లాగ్ఇన్ జోలికి పోకపోతే బిల్లుల చెల్లింపు సమస్య ఉండదని ప్రభుత్వం భావించి దీనికి దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. -
లక్ష 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కొండపి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇప్పటి వరకు లక్ష 72 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించినట్లు జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ ధనుంజయుడు తెలిపారు. అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొండపి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. 2006లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 36 వేల ఇళ్లు మంజూరు చేయగా... లక్షా 72 వేల మంది ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించుకున్నారన్నారు. 30 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ఐదో స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో కారంచేడు, చినగంజాం, చీమకుర్తి, మద్దిపాడు, జే పంగులూరు, కొండపి మండలాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండగా..దోర్నాల, త్రిపురాంతకం, అర్ధవీడు, మర్రిపూడి మండలాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మంది ఎస్సీలు ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 150 కేజీల ఇనుము సైతం అందించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులు 11 డిజిట్‌తో కూడిన ఆన్లైన్ అకౌంట్లనే ప్రారంభించుకోవాలన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సిమెంటు డబ్బులు దశలవారీగా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 50 శాతం పురోగతి సాధించలేని హౌసింగ్ అధికారులకు కలెక్టర్ మెమోలు ఇచ్చినట్లు చెప్పారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 41 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టాలు తీసుకుని గ్రౌండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.