అంతులేని అవినీతి
‘ఇందిరమ్మ’ అవకతవకలపై విచారణ ముమ్మరం
వెలుగు చూస్తున్న అక్రమాలు
ఊరూరా లక్షల రూపాయలు స్వాహా!
నారాయణఖేడ్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, ఆక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హౌసింగ్‌శాఖలో అవినీతి భారీగా జరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఓ అంచనా కోసం జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని నాలుగు గ్రామాల్లో సీబీసీఐడీ అధికారులు మొదటి విడతగా విచారణ చేపట్టారు.
ఇప్పటికే నాలుగు గ్రామాల్లో రెండు సార్లు సీబీసీఐడీ అధికారులు బృందాలుగా వెళ్లి ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై లబ్ధిదారులు, హౌసింగ్ అధికారులు, ఇతరులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలోని కేరూర్, నాగులపల్లి, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో శేరిదామరగిద్ద, ఖేడ్ మండలంలోని పంచగామ గ్రామపంచాయతీ పరిధిలో విచారణ జరిపారు.
లక్షల్లో అవినీతి
సీబీసీఐడీ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో దాదాపు ప్రతి గ్రామంలో లక్షల్లో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పంచగామ గ్రామ పంచాయతీ పరిధిలో హౌసింగ్ శాఖలో రూ.1.35 కోట్లతో 419 ఇళ్లు మంజూరుకాగా, అందులో 176 ఇళ్ల పేరిట అక్రమార్కులు రూ.47 లక్షలను బిల్లుల రూపంలో స్వాహా చేశారు.తెల్ల రేషన్‌కార్డులు లేకుండా కొందరి పేర్ల మీద, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కొందరి పేర్ల మీద ఇళ్లు మంజూరు అయినట్టు అధికారులు గుర్తించారు. పూర్తి విచారణ చేపట్టిన అధికారులు రూ.47 లక్షల వరకు అవినీతి జరిగిందని నిర్ధారించారు.
ఈమేరకు సీబీసీఐడీ అధికారులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనూరు మండలం శేరిదామరగిద్దలో 506 ఇళ్లు మంజూరు కాగా, అందులో రూ.25.92 లక్షలు అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా ఇటీవల నారాయణఖేడ్‌లోని డీసీసీబీ బ్యాంకులో ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు సేకరించారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు
2004 నుండి 2014 వరకు హౌసింగ్ శాఖలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టడంతో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొదట జిల్లాలోని నాలుగు గ్రామాల్లోనే విచారణ జరుగుతున్నా, మిగితా గ్రామాల్లో అవినీతికి పాల్పడ్డ వారు కూడా ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు, పైరవీకారులు ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. హౌసింగ్ అధికారులు, కింది స్థాయి సిబ్బందితో పాటు నేతల అండదండలతో ఇష్టారీతిగా హౌసింగ్‌శాఖ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు చెల్లించే క్రమంలో కూడా లంచాల పేరిట కొంత డబ్బు కాజేసినట్లు సీబీసీఐడి అధికారులు గుర్తించారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల అవకతవలపై విచారణ జరుగుతున్న తరుణంలో అవినీతి అధికారులు, నాయకులకు గుబులు పట్టుకుంది. ఏదిఏమైనా పూర్తి స్థాయి విచారణ జరిగి హౌసింగ్‌శాఖ అవినీతి బట్టబయలు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.