* బషీరాబాద్‌కు రానున్న అధికారులు
* అక్రమార్కుల్లో గుబులు
బషీరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల వ్యవహరంపై మళ్లీ సీబీసీఐడీ అధికారులు బషీరాబాద్‌కు మరో రెండ్రోజుల్లో విచారణకు రానున్నారు. ‘ఇందిరమ్మ’ ఇళ్ల అవకతవకల్లో బషీరాబాద్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అవినీతి జరిగిన విషయం తెలిసిందే.. దీంతో ‘ఇందిరమ్మ’ అక్రమాల పుట్టను బట్టబయలు చేసేందుకు సెప్టెంబర్ నెలలో సీఐడీ అధికారులు విచారణ మొదలుపెట్టారు. విచారణ చేసి వెళ్లాక తిరిగి సీఐడీ అధికారులు బషీరాబాద్‌కు రానుండడంపై అధికారులు, దళారులకు భయం పట్టుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వహయంలో ‘ఇందిరమ్మ’ మొదటి విడతలో బషీరాబాద్ గ్రామపంచాయతీ ఎంపికైంది. ఇక్కడ హౌజింగ్ అధికారులు నిబంధనలకు వి రుద్ధంగా ఇళ్లను మంజూరు చేశారు. అధికారుల చేతి వాటం, దళారుల ప్రోత్సాహంతో బషీరాబాద్ గ్రామంతోపాటు, అనుబంధ గ్రామమైన నవాంద్గి లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించుకోకుండానే బిల్లులు చేశారు. ఈ విషయమై సీఐడీ అధికారులు అప్పట్లో విచారణ చేశారు.
సగానికి పైగా పాత ఇళ్లకే బిల్లుల చెల్లింపు..
బషీరాబాద్ గ్రామ పంచాయతి పరిధిలో ‘ఇందిరమ్మ’ మొదటి విడతలో 1195 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 951 ఇళ్ల నిర్మించినట్లు హౌజింగ్ అధికారులు బిల్లులు చెల్లించారు. అయితే లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు రాలేదని ఆందోళన చేయడంతో రెండేళ్ల క్రితం బషీరాబాద్‌లో విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. అందులో 479 ఇళ్ల నిర్మాణం చేయకుండానే బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. వీటిలో కొన్ని పాత ఇళ్లనే కొత్తవాటిగా చూపి బిల్లులు చేసుకున్నట్లు కూడా గుర్తించారు. ఈ 479 ఇళ్లకు సంబంధించి రూ.98 లక్షల మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి.
అడ్రస్ లేని 146 ఇళ్లు...
బషీరాబాద్, నవాంద్గి గ్రామాలలో సీఐడీ అధికారులు సెప్టెంబరులో విచారణ చే యగా బిల్లులు చేసుకున్నవాటిలో 146 ఇళ్లను అడ్రస్ లేని ఇళ్లుగా గుర్తించారు. నిర్మించని 479 ఇళ్లలో హౌజింగ్ అధికారులు కొన్ని నిజాం కాలం నాటి ఇళ్లను చూపించినా కూడా 146 ఇళ్లు రికార్డులకు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో పని చేసిన అధికారులు చేతి వాటం ప్రదర్శించి ఇళ్ల ను చూడకుండానే బిల్లులు చేయడం గమనార్హం.
జోరుగా చర్చ....
మండల కేంద్రంలో ఇళ్ల భాగోతంపై సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేయనున్నారు. గతంలో చేసిన విచారణ మాదిరిగానే చేసి వెళతారా లేక అక్రమాలకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకుంటారా అనేదానిపై మండల కేంద్రంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అక్రమాలకు పాల్పడ్డ హౌజింగ్ అధికారులను హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారోనని మధ్యవర్తులలో గుబులు రేకెత్తుతోంది.
‘ఇందిరమ్మ’ పై సీఐడీ పునర్విచారణ
Published Mon, Oct 27 2014 2:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement