వరంగల్, న్యూస్‌లైన్ :
భూ సేకరణ చేయకపోవడం, ప్రైస్ ఎస్కలేషన్ కోసం కాంట్రాక్టర్ల పంతం... పరిష్కరించేందుకు సర్కారు వెనుకంజ వెరసి జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలడం లేదు. ఒక్కో ప్యాకేజీలో సగం పనులు కూడా చేయలేదు. పనులు జాప్యమవుతున్న కొద్దీ... కాంట్రాక్టర్లకు మాత్రం మేలే జరుగుతోంది. కోట్ల రూపాయల అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను రూ.9,427 కోట్లతో నిర్మాణం చేయాల్సి ఉండగా... గడువు పెంచుకుంటూ పోవడంతో మరో రూ.1,976 కోట్లు అదనంగా పెరిగారుు. జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద 5,61,229 ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా... 484 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 36.250 టీఎంసీల నీటి వినియోగంతో ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను రూపొందించినా... నిర్లక్ష్యం కారణంగా పనులు కొనసా...గుతూనే ఉన్నారుు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు మొదలై బుధవారానికి సరిగ్గా పదేళ్లు. ఈ కాలంలో చేపట్టిన పనులు, నిలిచిన పనుల వివరాలు ఓ సారి పరిశీలిస్తే...
మొదటి నుంచీ అంతే..
ఏటూరునాగారం మండలం గంగారం నుంచి దేవాదుల ప్రాజెక్ట్ మొదలవుతుంది. గంగారంలో ఇన్‌టేక్‌వెల్ నిర్మాణంతో తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. రూ.844 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను 2004 జనవరి 8వ తేదీన హెచ్‌సీసీ, కేబీఎల్ జాయింట్ వెంచర్‌కు కట్టబెట్టారు. పనులు పూర్తి చేయాల్సిన గడువు 18 నెలలు... అంటే 2005 జూలై 7వ తేదీ వరకు పూర్తి కావాలి. కానీ... ఇప్పటివరకు సరిగ్గా 15సార్లు గడువు పెంచారు. రూ. 844 కోట్లతో ప్రారంభమైన తొలి దశ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పుడు రూ. 1,419.98 కోట్లకు ఎగబాకింది.
తొలిదశలో మొత్తం 138.50 కిలోమీటర్ల పరిధిలో పైపులైన్ వేయాలి. ఈ మేరకు గంగారం నుంచి ధర్మసాగర్ వరకు పైపులైన్ వేసినా... నీటి తరలింపు భారమవుతోంది. మోటార్లు పనిచేయకపోవడం... పైపులైన్ లీకేజీ వంటి కారణాలు ప్రతిబంధకంగా నిలిచారుు. 138 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడా 2 కిలోమీటర్ల మేర భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ దశలో 77,700 ఎకరాల నీరందించాల్సి ఉండగా... ఇప్పటికీ ఒక్క ఎకరాకూ నీరు పారడం లేదు.
1.23 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ధర్మసాగర్ చెరువును రిజర్వాయరుగా మార్చడం... ప్రధాన, ఉప కాల్వల నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించారు. 45, 46 ప్యాకేజీలుగా వీటిని గుర్తించారు. 2005 మార్చి 16, 17న వరుసగా 45, 46వ ప్యాకేజీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనుల గడువు 30 నెలలు కాగా... 45వ ప్యాకేజీ పనులను ఎనిమిది సార్లు, 46వ ప్యాకేజీ పనులను ఆరు సార్లు పొడిగించారు. ఈ రెండు ప్యాకేజీలకు అదనంగా పెంచిన అంచనా వ్యయం రూ.30 కోట్లు. కానీ... పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యూరుు. నగర శివారులో భూ సేకరణ ఇబ్బందిగా మారింది. ఈ ప్యాకేజీల్లో కనీసం 231 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ... భూముల ధరలు పెరగడం, ప్రభుత్వ ధర తక్కువగా ఉండడంతో రైతులు భూములివ్వడం లేదు. ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తోంది.
దిశ లేని రెండో దశ
మొత్తం 7.25 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంతో 196 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణానికి రూ.1,820 కోట్లతో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. 2005 ఏప్రిల్ నాలుగో తేదీన 4.74 శాతం ఎక్సెస్ అంటే.. రూ.1887 కోట్లతో హెచ్‌సీసీ, ఎన్‌సీసీ జాయింట్ వెంచర్‌కు పనులు అప్పగించారు. పనులు పూర్తి చేయాల్సిన గడువు 30 నెలలు. కానీ... ఇప్పటివరకు ఎనిమిది సార్లు పెంచారు. దీంతో అంచనా వ్యయం రూ. 2,037 కోట్లకు చేరింది. ఇంకా గడువు పెంచాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేస్తుండడం గమనార్హం.
ఈ దశలో స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ కింద 24,900 ఎకరాలకు నీరందించేందుకు కాల్వల నిర్మాణానికి రూ. 72 కోట్లతో 2007 జనవరి ఒకటిన అగ్రిమెంట్ చేసుకున్నారు. గడువు 18 నెలలే అరుునప్పటికీ... ఇప్పటివరకు ఏడు సార్లు గడువు పెంచారు. పెంచిన అంచనా రూ. 12 కోట్లు కాగా... పనులు ఆగిపోయాయి. స్టేషన్ ఘన్‌పూర్, తపాస్‌పల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూ సేకరణ లేకపోవడంతో పనులు నిలిచిపోయూరుు.
ఇదే రిజర్వాయరు కింద మరో 24 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ. 61 కోట్లతో నాలుగో కాల్వ నిర్మాణ పనులకు 2010 ఆగస్టు 18న అగ్రిమెంట్ చేశారు. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మూడుసార్లు గడువు పెంచారు. అంచనా వ్యయూన్ని కూడా రూ.4 కోట్లకు పెంచుకున్నారు.
ఈ దశలోనే తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద 60 వేల ఎకరాలకు నీరందించే కాల్వల నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించారు. 2007 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేసుకోగా... 18 నెలలో పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు మూడుసార్లు గడువు పెంచగా... అంచనా రూ. మరో 6 కోట్లు పెరిగింది.
అశ్వరావుపల్లి, చీటకోడూర్ రిజర్వాయర్ల కింద 56 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ. 87 కోట్లతో 2007 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేశారు. 18 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 40 శాతం కూడా చేయలేదు. ఇప్పటికే నాలుగుసార్లు గడువు పెంచారు. అంచనా కూడా రూ. 4 కోట్లకు పెరిగింది.
మూడోదశకు భూసేకరణ గండం
మూడో దశ పనులకు భూ సేకరణ అడ్డంగా మారింది. ఈ దశలో 25.75 టీఎంసీల నీటిని వినియోగించడం, 9 చోట్ల లిప్టులు, 89 కిలోమీటర్ల సొరంగంతో 2.42 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలి. ఈ పనులను 2005 ఏప్రిల్ 29న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ముందుగా అంచనా వ్యయం రూ. 4554 కోట్లు కాగా... ఇప్పటివరకు రెండుసార్లు గడువు పెంచారు. దీంతో అంచనాలు రూ. 5,789 కోట్లకు పెరిగాయి. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు నిర్మాణం చేయాల్సిన సొరంగం పనులు ఏడాదిన్నరగా ఆగిపోయాయి. 19 కిలోమీటర్లు మేర మాత్రమే తవ్వారు. ఇప్పటి వరకు చేసిన పని కేవలం 20 శాతమే. దీనికి కూడా కభూ సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ... పనులు సాగకపోవడంతో అధికారులు పక్కన పడేశారు.
భారీగా పెరిగిన రివైజ్డ్ అంచనాలు
ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అటు ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. దీంతో కాంట్రాక్టర్లపై కనీస చర్యలు తీసుకునేందుకు సర్కారు సాహసం చేయలేదు. అంతేకాకుండా గడువు పెంచినప్పుడల్లా అంచనాలు కూడా పెంచింది. ఇప్పటివరకూ పెంచిన అంచనాలు రూ. 1976.98 కోట్లకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా నిర్ణయించిన రూ. 9,427 కోట్లకు ఇది అదనం.
దేవా ‘దశ’ తిరగదా..
Published Wed, Jan 8 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement