- ఉండవల్లి-పెనుమాకలో ప్రభుత్వ నజరానాలు
- అటు రియల్టర్లు - ఇటు మంత్రుల హైడ్రామా
- రైతులకు మాయమాటలు చెప్పి భూసేకరణ
తాడేపల్లి రూరల్ : మూడు పంటలు పండే పచ్చటి పంట పొలాలను రాజధాని పేరుతో లాక్కుని.. ఆ భూముల్నే నమ్ముకున్న తమకు అన్యాయం చేయొద్దంటూ వేడుకుంటున్న రైతులపై ‘ఆపరేషన్ ఉండవల్లి-పెనుమాక’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. లాండ్ పూలింగ్‌పై రైతులు కోర్టును ఆశ్రయించడం, కోర్టులు కూడా రైతులకు సానుభూతిగా ఉండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోంది. రైతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ పదేపదే మంత్రులు హెచ్చరించటమూ ఇందులో భాగమే.
అయితే, దీనిని సైతం ఎదుర్కొంటూ రైతులు కోర్టుల్లో సవాల్ చేస్తామంటూ గట్టిగా నిలబడుతున్నారు. దీంతో ఏం పాలుపోలేని స్థితిలో గ్రామాల్లో మైకులు పెట్టి ఊదరగొట్టడమే కాకుండా తమకు అనుకూలంగా ఉన్న కొందరితో భూసేకరణకు ప్రభుత్వం వెళ్తుందని నమ్మేలా అమాత్యులు వ్యూహాలు పనుతున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో పెద్ద మనుషులను గుర్తించి వారిని రంగంలోకి దింపుతున్నారు. ప్రభుత్వానికి పూలింగ్ కింద ఎకరం పొలం ఇప్పిస్తే ఐదు లక్షలు ఇస్తామంటూ నజరానా ఆశ చూపిస్తున్నారు.
రైతుల్లో భయాందోళన
తమ వాక్‌చాతుర్యాన్ని ఉపయోగించి రైతుల్లో ఒకింత భయాన్ని కలిగించడంలో మంత్రులు సఫలీకృతులయ్యారనే చెప్పాలి. ఎకరం రూ.4కోట్ల నుంచి రూ.6కోట్లు ధర పలికిన భూమిని కోటి ఇరవై, కోటి ముప్పై లక్షలకు తెగ్గొట్టి బేరాలు తెస్తున్నారు. ఉండవల్లిలో అధికారులు రిజిస్ట్రేషన్ ధర రూ.18లక్షలుగా గుర్తించారని, ఆ మేరకు భూసేకరణకు ప్రభుత్వం వెళితే మీకు వచ్చేది రూ.45లక్షలలోపే ఉంటుందంటూ భయపెడుతున్నారు. అందువల్ల పూలింగ్‌కు భూమి ఇవ్వటం లాభదాయకమని సలహా ఇస్తున్నారు.
వాస్తవం ఏంటంటే..
ఇదంతా మైండ్‌గేమ్ అని, భూసేకరణకు వెళ్లడం జరిగే పనికాదని ఓ రెవెన్యూ అధికారి ‘సాక్షి’ వద్ద అసలు గుట్టువిప్పారు. ఉండవల్లి సర్వే నంబర్ 5, 6లో రిజిస్ట్రేషన్ వాల్యూ రూ.4కోట్లు జరిగిందని చెప్పారు. భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌కు ముందు మూడేళ్లలో జరిగిన 100 సేల్‌డీడ్లు తీసుకుని, ఎక్కువగా జరిగిన 50 డాక్యుమెంట్ల యావరేజ్ ధర నిర్ణయించాల్సి ఉంటుందని, అందుకు రెండున్నర రెట్లు అదనంగా చెల్లించాలి కనుక భూసేకరణకు ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చిందనేది అధికారి వివరణ. అంత పెద్దమొత్తం ఇవ్వాల్సి వస్తుంది కనుకే ప్రభుత్వం భూసేకరణకు పోకుండా రైతులతో మైండ్‌గేమ్ మొదలు పెట్టినట్టు భావిస్తున్నారు. ఉండవల్లి, పెనుమాకలో కూడా భూసమీకరణ చేశాం అనిపించుకోవడానికి టీడీపీకి చెందిన ఓ రియల్ వ్యాపారి లాండ్‌పూలింగ్ పద్ధతిలో ‘జయభేరి’ మోగించడం మొదలుపెట్టారు.
భూసేకరణకు మైండ్‌గేమ్
Published Thu, Jun 4 2015 4:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement