
అంబాపురంలో టీడీపీ ప్రజాప్రతినిధి కబ్జా చేసిన భూమి ఇదే..
స్థలం వారిదే.. కానీ, వారి ఆధీనంలో లేదుకోర్టు తీర్పు వారికి అనుకూలంగానే వచ్చింది.. కానీ, పోలీసులు అమలు చేయరుఎందుకంటే.. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంఅక్కడ వివాదాస్పద ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంఆ వర్గం అడుగుపెట్టిన భూమి వారిదే..రాజధానిని దందాలతో హడలెత్తిస్తున్న ఆ ప్రజాప్రతినిధి మరోభూబాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ అంబాపురం సుందరయ్యనగర్‌లో దాదాపు రూ.2కోట్ల విలువైన స్థలాన్ని వారు గుప్పెటపట్టారు.
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థ స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్నేశారు. దాదాపు 20 సెంట్లు ఉన్న ఆ స్థలం మార్కెట్ ధర దాదాపు రూ.2 కోట్లు. ఖాళీగా ఉన్న ఆ భూమిలోకి ఆ ప్రజాప్రతినిధి వర్గీయులు కొన్ని నెలల క్రితం ప్రవేశించి తాత్కాలిక ప్రహరీ నిర్మించారు. ఆ విషయం తెలిసి స్థల యజమానులు ప్రశ్నిస్తే బెదిరించి పంపేశారు. తప్పుడు పత్రాలు చూపిస్తూ ఆ భూమిని మరొకరి నుంచి తాము కొన్నామన్నారు. స్థల యజమానులు తమ వద్ద ఉన్న అసలైన పత్రాలను చూపించినా ససేమిరా అన్నారు.
కోర్టు ఆదేశించినా..
దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2017, నవంబరులో యజమానులకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీ పట్టుకుని భూమి వద్దకు వెళ్తే మళ్లీ ప్రజాప్రతినిధి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో స్థల యజమానులు పోలీసుల వద్దకు వెళ్లారు. తమ స్థలాన్ని తమకు అప్పగించేలా చూడాలని కోరారు. స్టేషన్ ఆఫీసర్ స్థాయి పోలీసు అధికారి కోర్టు తీర్పు పట్ల సానుకూలంగా స్పందించారు. కానీ, ఆయన కంటే ఓ మెట్టుపై ఉన్న ఓ మధ్యస్థాయి అధికారి మాత్రం ససేమిరా అన్నారు. ప్రజాప్రతినిధి వర్గీయులకు అండగా నిలుస్తూ స్థల యజమానులను బెదిరించారు. ఏదో సెటిల్‌మెంట్ చేసుకుని ఆ స్థలాన్ని వదులుకోవాలని సూచించారు. అందుకు వారు సమ్మతించలేదు. సివిల్ కేసులో కోర్టు తీర్పును అమలుచేయాలి కదా.. అని పోలీసులను కోరారు. దీంతో ఆ పోలీస్ అధికారి తీవ్రంగా స్పందిస్తూ.. ‘నా మాట విని ఆ స్థలం మీద ఆశ వదులుకో. లేకపోతే ఈ సివిల్ కేసు కాస్తా క్రిమినల్ కేసుగా మారుతుంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో బాధితులు బిత్తరపోయారు. ఆ పోలీసు అధికారి.. అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది.
విగ్రహాల మాటున దందా
స్థల యజమానులు తమ భూమిలోకి వెళ్లేందుకు పోలీస్ రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇంతలో ప్రజాప్రతినిధి వర్గం ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో స్థల యజమానులు ‘ఆ స్థలం న్యాయస్థానం పరిధిలో ఉంది’ అనే బోర్డును ఏర్పాటుచేశారు. కానీ, ప్రజాప్రతినిధి వర్గం ఆ బోర్డును తొలగించేసింది. కోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వస్తుందని ప్రజాప్రతినిధి వర్గం భావించింది. దీంతో అక్కడ వినాయక విగ్రహాలను పెట్టింది. ఆ స్థలాన్ని అసలు యజమానులకు అప్పగించేలా పోలీస్ రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశిస్తే.. అక్కడ విగ్రహాలను తొలగించాలి. అలా జరిగితే విగ్రహాలను తొలగిస్తున్నారంటూ కొత్త వివాదం సృష్టించాలన్నది పన్నాగం. రాజధానిలో ఆ టీడీపీ ప్రజాప్రతినిధి దందాల్లో ఇదో సరికొత్త కోణం. అందుకు పోలీస్ అధికారి అండగా నిలుస్తుండటంతో బాధితుల గోడు వినే నాథుడే లేకుండాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment