కబ్జాలకు కేరాఫ్‌ | land gobbles care of madanapalle | Sakshi
Sakshi News home page

కబ్జాలకు కేరాఫ్‌

Published Sat, Jun 10 2017 11:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

కబ్జాలకు కేరాఫ్‌

కబ్జాలకు కేరాఫ్‌

► ఆక్రమణలో 500 ఎకరాల ప్రభుత్వ భూములు
► క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశం
► రాజకీయ ఒత్తిళ్లతో వెనుకడుగు వేస్తున్న స్థానిక అధికారులు
► మదనపల్లె నియోజకవర్గంలో భూ వివాదాలే అధికం


మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద మాజీ సైనికులకు చెందిన కొంత భూమి ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నుపడింది. అధికార అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసేశారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా మాజీ సైనికుల సంఘం డివిజన్‌ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆందోళనలు చేపట్టారు. ఫలితం లేకుండా పోయింది.  స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

పట్టణంలోని రాగిమాను సర్కిల్‌ వద్ద ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులకు చెందిన భుమిని మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఆక్రమించేశారు. దీనిపై పట్టణ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. పోలీసులూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కోర్టుమెట్లెక్కాల్సి వచ్చింది.

స్థానిక బైపాసు రోడ్డులో పాత్రికేయుల కోసం రెవెన్యూ ఆధికారులు కొంత స్థలాన్ని కేటాయించారు. దీన్ని కొల్లగొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పక్కాగా స్కెచ్చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తమ తాతల ఆస్తి అంటూ బుకాయించారు. దీనిపై పాత్రికేయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు.

ఇలా చెప్పుకుంటూపోతే దేశంలోనే పెద్ద రెవెన్యూ  డివిజన్‌ అయిన మదనపల్లెలో భూకబ్జాల భాగోతం అంతాఇంతాకాదు. ఇప్పటికే దాదాపు 500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి చేరిపోయాయి. వీరిపై చర్యలకు వెనుకడుగు వేస్తుండడంతో మరిన్ని భూములు ఆక్రమించేందుకు చర్యలు వేగవంతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


మదనపల్లె: జిల్లాలో ఎక్కడాలేని విధంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ.500 కోట్ల భూములు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.   ఆక్రమణలపై ఇదివరకున్న కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతలో కలెక్టర్‌ బదిలీ కావడంతో చర్యలు ఆగిపోయాయి. రాజకీయ ఒత్తిళ్లతో ప్రస్తుత అధికారులు ఏమీచేయలేక మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది.

300 ఎకరాలు కబ్జా..
మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, మాజీ సైనికులు, రైతుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. గతంలో చేపట్టిన రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. సబ్‌ కలెక్టర్‌ క్రితికాబాత్ర ఈ భుముల ఆక్రమణలపై అప్పటి కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికలివ్వాలని ఆదేశించారు. గత తహసీల్దార్‌ రెడ్డెప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను గుర్తించి నివేదికలిచ్చారు.

పట్టణ పరిధిలోనే ఎక్కువ..
పట్టణ పరిధిలోని అమ్మచెరువు మిట్ట, అన్నమయ్య సర్కిల్, గజ్జలకుంట, తురకవానికుంట, కోమటివాని చెరువు, బెంగళూరురోడ్డు, బసినికొండ, పొన్నూటిపాళ్యం తదితర ప్రాంతాల్లోని దాదాపు 80 సర్వే నంబర్లలో దాదాపు 300 ఎకరాల డీకేటీ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. వీరి ఆగడాలకు ఎలాంటి ఆటంకాలూ ఎదురుకాకపోవడంతో మరిన్ని భూములు ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎం ఆదేశాలు బేఖాతర్‌..
నివేదికలను కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌కు సమర్పించగా ఆయన వీటిని నేరుగా సీఎంకు పంపారు. స్పందించిన సీఎం ఆక్రమణదారులందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గతంలోనే ఆదేశించారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనే పాసుపుస్తకాలు..
అధికార పార్టీ అండతో ఈ మూడేళ్లలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. వీటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కాలేదు. వీటికి దరఖాస్తు చేసుకున్న కబ్జాదారుల నకిలీ డాక్యుమెంట్లను సబ్‌ కలెక్టర్‌ గుర్తించారు. పాసుపుస్తకాలు మంజూరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం పలు పాసుపుస్తకాలు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement