►రూ.10 కోట్ల స్థలం కబ్జా
►తెలుగు తమ్ముళ్ల అండతో అక్రమనిర్మాణాలు
►పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కావలి : టీడీపీ నేతల భూకబ్జాలకు అంతేలేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారం అండదండలతో విలువైన స్థలాలను ఆక్రమించుకుంటూ పోతున్నారు. తాజాగా కావలి మున్సిపాలిటీ పరిధిలో సుమారురూ.10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. తెలుగు తమ్ముళ్ల అండతో ఆక్రమణదారులు భవంతులు, షెడ్‌లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందినా నోరు మెదపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని వెంగళరావునగర్ వాటర్‌ట్యాంక్ కోసం 2048 సర్వే నంబర్‌లో సుమారు 4 ఎకరాల వరకు స్థలం ఉంది.
పట్టణం విస్తరిస్తుండటంతో ముందుచూపుతో ఈ స్థలాన్ని వాటర్‌ట్యాంకు నిర్మాణం కోసం కేటాయించినట్లు తెలిసింది. అయితే ఈ స్థలం అధికార పార్టీ అండదండలతో ఆక్రమణలకు గురైంది. 2008లో ఇదే స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆక్రమణలను తొలగించారు. ఆ తరువాత ఆ స్థలంలోకి వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపల్ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు.
కొంతకాలంగా నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ ఆక్రమణల విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే అందులోకి వెళ్లటానికి అధికారులు సాహసించడం లేదు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కూడా బదిలీ కావడం.. ఆ స్థానాన్ని ప్రభుత్వం భర్తీచేయకపోవడంతో టీడీపీ నేతలు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా పార్కుకు సంబంధించిన సుమారు 300 అంకణాల స్థలం ప్రస్తుతం కబ్జాకోరల్లో చిక్కుకుని ఉంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో విలువైన స్థలాలు అక్రమార్కుల చెరలో చిక్కుకుపోతున్నాయి. ఈ కబ్జాలను ఆపకుంటే ఆ మున్సిపల్ స్థలం పూర్తిస్థాయిలో ఆక్రమణదారుల చెరలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ అధికారి దఫెయ్యను వివరణ కోరగా.. ఆక్రమణల గురించి తమకూ సమాచారం వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పలుమార్లు ఫిర్యాదు చేశాం:
అక్కడ జరుగుతున్న ఆక్రమణలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. కానీ ఆక్రమణల తొలగింపుపై అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే ఆక్రమణలు తొలగించి మున్సిపల్ స్థలాలను పరిరక్షించాలి.
- పందిటి కామరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి.
ప్రభుత్వ జాగా..వేసేయ్ పాగా
Published Sun, May 24 2015 3:34 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement