ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాలు, వీటిని ఆనుకుని ఉన్న భూమి రెవెన్యూ సర్వే నంబర్ 2లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కార్యాలయాలు సర్వే నంబర్ 2తోపాటు సర్వే నంబర్ 31 శివారులో కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. 2,31 సర్వే నంబర్లు భుక్తాపూర్‌లోకి వస్తాయి. ఒకప్పుడు 2 సర్వే నంబర్‌లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాల్లో ఉండగా ప్రస్తుతం మార్పు ఎలా జరిగిందన్న ప్రశ్న తలెత్తుతోంది. 1982-83లో కొంతమంది కాస్తుదారులకు ఇచ్చిన పహణీ పత్రంలో కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాలు సర్వే నంబర్ 2/1లో ఉన్నాయి. ఈ సర్వే నంబర్‌లో 29 ఎకరాల 80 గుంటల స్థలం ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో కలెక్టరేట్, జెడ్పీ భవనాల స్థలం పోనూ 14 ఎకరాలు కాస్తుకు ఇచ్చినా అన్యాక్రాంతమైంది. దీని విలువ ఇప్పుడు దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది.
సాగు కోసం 14 ఎకరాలు
సర్వే నంబర్ 2/1లో సుమారు 14 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఒకే కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులకు సాగు చేసుకోవడానికి ఇచ్చింది. ఈ భూములను కొనడానికి అమ్మడానికి వీలులేదు. ఈ భూమిపై వారి పేర్ల మీద టైటిల్ డీడ్, పట్టా పాస్‌బుక్, పహణీ జారీ అయ్యాయి. ఆ భూములపై రుసుము కూడా చెల్లించారు. 1982-1983లో రెవెన్యూ నుంచి సదరు వ్యక్తులు పొందిన భూమి కలెక్టరేట్ వెనుక భాగంలోని రిక్షాకాలనీలో ఉంది. ఇందులోని 8.25 ఎకరాల్లో పంట, మూడు ఎకరాలు కాస్తు చేస్తున్నట్టు ఉన్నాయి. కొన్ని రోజులు సాగు చేసి అనంతరం సాగు మానుకున్నారు. పట్టా పాస్‌బుక్‌లు పొంది కాస్తు చేసిన వారి చేతిలో ప్రస్తుతం ఆ స్థలం లేదు. అప్పట్లో భూముల విలువ అంతగా లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు.
పెద్దల పరం.. సర్కారు స్పందిస్తే మేలు..
ఆదిలాబాద్‌లో దివాలా తీసిన ఓ వ్యాపారవేత్త రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని బోగస్ పత్రాలు సృష్టించి ఈ 14 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో నుంచి కొంత భూమిని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేతకు విక్రయించగా, ఆయన దర్జాగా ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దాని సమీపంలోనే ఉన్న స్థలాన్ని సదరు వ్యాపారి రాజకీయ అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో బోగస్ లేఔట్లు తయారు చేసి, బై సర్వే నంబర్లు సృష్టించి ప్లాట్లను విక్రయించాడు. ప్రభుత్వం ఒక్కసారి ఒకరి పేరు మీద పట్టా ఇచ్చిన తర్వాత తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే తప్పించి ఆ స్థలంపై ఇతర వ్యక్తుల పేరుపై పట్టా జారీ చేయడం జరగదు. ఒకవేళ సదరు కాస్తకారులే ఆ భూమిని విక్రయిస్తే మొదటి సర్వే నంబర్‌కు అదనంగా బై నంబర్‌తో ఆ స్థలానికి పత్రం జారీ చేస్తారు. అయితే ఇవన్ని జరగకుండానే 2/1 లోని స్థలంపై బోగస్ పత్రాలు సృష్టించి బై నంబర్లతో రూ.కోట్ల విలువైన భూములను కబ్జా చేశారు. అన్ని ఒరిజినల్ పత్రాలు ఉన్నా ప్రస్తుతం ఆ స్థలం బలవంతుల చేతిలో ఉండడంతో అసలు హక్కుదారులు వారిని ఎదుర్కోలేక పోతున్నారు. ఒకవేళ ప్రభుత్వమైన ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే విలువైన భూములు సర్కారు చేతిలో ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అంతా మాయ
ఆదిలాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల పరంగా 2/1 సర్వే నంబర్‌లో 29 ఎకరాల 80 గుంటలు, 2/2లో ఒక ఎకరం 28 గుంటలు, సర్వే నంబర్ 2/3 లో 5 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంది. బోగస్ పత్రాలతో ఆ సర్వే నంబర్‌లోని భూమి కబ్జా చేసిన రియల్టర్లు 5 ఎకరాల 67 గుంటల్లో లేఔట్‌లలో ప్లాట్లు చేయడం గమనార్హం. ప్లాట్ల విక్రయంలో రిజిస్ట్రేషన్ పరంగా జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. సేల్ డీడ్ పత్రంలో ప్లాట్ దస్నాపూర్ గ్రామంలోని దిగా పేర్కొంటూ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైనట్టు చూపుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్లాట్లు ఉన్నప్పుడు వార్డు బ్లాక్ లేకుండా ఉండదని, రిజిస్ట్రేషన్‌లో ఉన్న లోపాల ఆధారంగా జిమ్మిక్కులతో రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
సర్వే నంబర్ల ఒకటైతే.. 2/1లో ఆక్రమణ..
సర్వే నంబర్ 2/1ను ఆనుకొని రెండు వేర్వేరు సర్వే నంబర్లలో పలువురు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి. ఆయా సర్వే నంబర్లలో ఎన్నో ఏళ్ల కిందనే లేఔట్లు చేసి ప్లాట్లుగా విక్రయించారు. వందలాది ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఆ సర్వే నంబర్లలో మిగులు స్థలం లేకపోయినా కొంత మంది బోగస్ సర్వే నంబర్లు సృష్టించి ఆయా సర్వే నంబర్లను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం 2/1లో ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారి అసలు సర్వే నంబర్‌కు బై సర్వే నంబర్ సృష్టించి విచ్చలవిడిగా రెవెన్యూ స్థలంలోని భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఒక్కొక్క ప్లాట్ విలువ సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల పైబడి ఉండటం గమనార్హం. 2/1 సర్వే నంబర్‌లో కొంత స్థలాన్ని పట్టణంలోని ఓ ప్రముఖ వ్యక్తి తన సర్వే నంబర్‌లోని భూమిగా చూపెడుతూ సర్కారు స్థలంలో అది తన స్థలంగా పేర్కొంటూ ఇటీవల బోర్డులు పెట్టడం వివాదానికి దారి తీస్తుంది.
అధికారుల వివరణ ఇదీ..
2/1 సర్వే నంబర్ విషయంలో ‘న్యూస్‌లైన్’ ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా 2/1 సర్వే నంబర్‌లో ప్రభుత్వ స్థల విషయంలో తనకు అవగాహన లేదని, ఈ విషయంలో పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ తహశీల్దార్ సిడాం దత్తును వివరణ కోరగా ఎన్నో ఏళ్ల కిందట ఈ స్థలం కబ్జాకు గురైందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తసుకెళ్లి స్థలం స్వాధీనం చేసుకునే విషయంలో పరిశీలిస్తామని పేర్కొన్నారు.
భూ మాయ
Published Sat, Nov 9 2013 12:47 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement