మిల్లు వెనక ఖాళీ స్థలాలు
సాక్షి, ఆసిఫాబాద్: రాజకీయ అండతో సర్‌సిల్క్ భూముల్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్‌సిల్క్ మిల్లులో పనిచేయని కార్మికేతరులు దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. చట్టబద్దంగా భూములు కొనుగోలు చేసిన వారిని బెదిరించడం పరి పాటిగా మారింది. కాగజ్‌నగర్ పట్టణానికి ఆనుకుని కోసిని గ్రామ పరిధి సర్‌సిల్క్ మిల్లు భూ ములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన చోట్ల ఆక్రమణలు చేయడమే కాక ఖాళీ చేయడానికి స సేమిరా అంటున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను కబ్జాదారులు వాడుకోవడం గమనా ర్హం.
ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కబ్జాదారులకు అండగా ఉండగా, ఆయన సన్నిహితులు, అనుచరులు, సమీప బంధువులు యథేచ్ఛగా మిల్లు భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారు. అలాగే కబ్జాల్లో ఉన్న భూములు తమ సొంత భూములగా పేర్కొం టూ ఇతరులకు విక్రయించడం విశేషం. ఇటీవల దాడా నగర్‌లో అధికారులు అక్రమ నిర్మాణంగా పరిగణిస్తూ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే.
తనకు వాటా ఇవ్వలేదని..
కాగజ్‌నగర్ పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం సర్‌సిల్క్ మిల్లు ఓ వెలుగు వెలిగింది. మిల్లు మూత పడిన తర్వాత భూములు రానురానూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుపోయాయి. ఇందులో కొందరు బలహీనవర్గాలు ఉండగా అధికంగా ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులు, అనుచరులు ఉండడం గమనార్హం.
తాను అడిగిన రోడ్డు పక్కన ఉన్న పదెకరాల భూమి దక్కకపోవడంతో తెర వెనక ఉండి తతాంగం నడిపిస్తున్నారు. మొత్తం భూములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన వ్యక్తులకు చెందకుండా అడ్డు తగులుతున్నారు. ఈ మేరకు భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
మొత్తం 808 ఎకరాలు..
సర్‌సిల్క్ భూములు మొత్తం 808 ఎకరాల వరకూ ఉంది. ఇందులో 1985లో మిల్లు మూత పడే నాటికే కొంత ఆక్రమణకు గురైంది. ఆ తర్వాత 1991లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అధికారికంగా లిక్విడేటర్‌ను నియమించి మిల్లు ఆస్తులను, అప్పులను లెక్కగట్టి యాక్షన్‌కు పిలిచింది. ఈ యాక్షన్‌లో మొత్తం 14 బిడ్డింగ్ వేయగా ఇందులో మూడో బిడ్ వేసిన బి. వెంకట నారాయణరావు రూ.3 కోట్లతో అధిక భాగం 182 ఎకరాలు యాక్షన్ చేశారు.
ఇందులో 156 ఎకరాలు అధికారికంగా ఇచ్చారు. అయితే అప్పటికే యాక్షన్‌లో కొనుగోలు చేసిన భూమి కొంత ఆక్రమణ గురవడం, నిర్మాణాలు చేపట్టడంతో వీటన్నింటిని ఖాళీ చేయించి కొనుగోలు చేసిన భూమి మొత్తం ఇప్పిస్తామని యాక్షన్ సమయంలో చెప్పారు. అప్పటి నుంచి రానురానూ స్థానిక నాయకుల అండతో కొంత మంది ఏకంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, కబ్జాలు పెరిగిపోయాయి. దీంతో 2011లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమికి హద్దులు చూపించాల్సి ఉంది.
అయినా ఇప్పటికీ హద్దులు నిర్ణయించేలా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. దీనిపై జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ అందరి అధికారులను కలసి వినతిపత్రాలు అందించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఇక చేసేదేమీ లేక మళ్లీ కోర్టునే ఆశ్రయించడంతో ఇటీవల కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు అడుగు ముందుకేశారు. అయితే అధికారులు అక్రమ కట్టడాలను తొలగించేందుకు పూనుకుంటున్న సందర్భంలో అక్కడి నాయకులు అడ్డుతగలడంతో భూమి హద్దులు తేల్చడంలో జాప్యం చేస్తున్నారు.
2014లో సర్వే చేసేందుకు రూ.14లక్షలు చెల్లించినప్పటకీ అక్కడి స్థానిక నాయకుడికి భయపడి సర్వే అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు వెంకట నారాయణరావు వాపోతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని వదలనని పేర్కొంటు న్నారు. రాజకీయ అండతో అన్యాక్రాంతం చేయాలని ఓ ప్రజాప్రతినిధి కక్షగట్టారని వివరిస్తున్నారు. ఇటీవల హైకోర్టు నుంచి కూడా యాక్షన్‌లో కొనుగోలు చేసిన వారికి భూమి సరిహద్దులు చూపి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment