సమస్యల ఏకరువు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
రెండున్నర దశాబ్దాలకుపైగా తాత్కాలిక పట్టాలతో సాగు చేసుకుంటున్న భూమిని ఆ 53 మందికి ట్రీ పట్టాలుగా ఇవ్వాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. అద్దంకి మండలం నంబూరివారిపాలేనికి చెందిన 53 మంది మహిళలు స్థానిక నాయకులు కట్టా హనుమంతురావు, కట్టా శ్రీనివాసరావు నాయకత్వంలో వెళ్లి తమకు పట్టాలు ఇవ్వాలని సోమవారం ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో విన్నవించుకున్నారు. కలెక్టర్ స్పందిస్తూ సర్వే నంబర్ 955లోని ఆ భూమిని ‘ట్రీ’ పట్టాల కింద ఇవ్వాలని, ఈ మేరకు రిజల్యూషన్ పాస్ చేయాలని ఆదేశించారు.
ఏడాది నుంచి వేతనాల్లేవు
ఆరేళ్ల నుంచి మదర్సాలో విద్యా వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు గతేడాది జనవరి నుంచి వేతనాలు ఇవ్వడం లేదని కనిగిరికి చెందిన ఐదుగురు వాపోయారు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ విద్యా వలంటీర్లకు ప్రతి నెలా ఐదో తేదీలోగా వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఒకవేళ వారికి సంబంధించిన వివరాలు రాకపోయినా బడ్జెట్ నుంచి చెల్లించాలన్నారు.
ఇళ్ల స్థలాలివ్వాలి
కందుకూరు మండలం పాలూరు కుంట పోరంబోకులో ఇళ్ల స్థలాలివ్వాలని పలువురు కోరారు. సర్వే నంబరు 55లో కొన్నేళ్ల నుంచి 4.45 ఎకరాల భూమి ఖాళీగా ఉందన్నారు. చిల్లచెట్లు పెరిగిన ఆ స్థలాన్ని తాము చదును చేసుకుంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నకిలీ పట్టాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు.
పొలానికి వెళ్లేందుకు దారిలేకుండా చేశారు
తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన పీ ఏసురత్నం ఫిర్యాదు చేశాడు. తమ పక్క గ్రామమైన ఇలపావులూరులోని సర్వే నంబర్ 470లో 2.76 ఎకరాల పొలం ఉందని తెలిపాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికల అనంతరం తన కుటుంబంపై కక్షకట్టిన అగ్రవర్ణాలు పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని వివరించాడు.
కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలి
ఒంగోలు నగర పాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో వీధి లైట్లు, వాటర్ వర్క్స్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చెల్లింపులో నిబంధనలు ఉల్లంఘించిన ఎస్‌సీఎల్‌సీఎస్ సొసైటీ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు ముదివర్తి బాబూరావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి కోరారు. 54 మందికి జీఓ నంబర్ 333 ప్రకారం కనీస వేతనం *6700 చెల్లించాల్సి ఉన్నా కాంట్రాక్టర్ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.
మంచినీటి ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలి
కారంచేడు మండలం స్వర్ణ పంచాయతీకి చెందిన మంచినీటి ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలని సర్పంచ్ కే లక్ష్మణబాబు కోరారు. మాజీ సర్పంచ్ గ్రామంలోని దాతల సహకారంతో మంచినీటి ఆర్‌ఓ ప్లాంట్‌ను నిర్మించారన్నారు. నూతన పాలకవర్గం వచ్చిన తరువాత ఆ ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించకుండా మంచినీటి వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పంచాయతీ భవనాన్ని, అందులోని ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్వాధీనపరచాలని కోరారు.
ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి
ఒంగోలు నగరంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సాధన సమితి నాయకులు ఎం శ్రీనివాసులు, ఎస్ శివరామకృష్ణ కోరారు.
కమ్యూనిటీ హాలుకు తాళం వేశారు
ఇంకొల్లు మండలం దుద్దుకూరులోని కమ్యూనిటీ హాలుకు తాళం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్పంచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.గ్రామ కంఠంలోని సర్వే నంబర్ 225లో 2009-2010 కాలంలో అప్పటి పాలకమండలి కమ్యూనిటీ హాలు నిర్మించిందన్నారు. శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనం కూలిన తరువాత అక్కడే కార్యకలాపాలు నిర్వహించేలా తీర్మానం చేశారని తెలిపారు. నూతన పాలకవర్గం రావడంతో కమ్యూనిటీ హాలుకు తాళం వేసి స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ప్రజాదర్బార్‌లో లెక్క ఇది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గతేడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు 24,538 అర్జీలు అందాయి. వీటిలో ఇప్పటి వరకు 7,665 అర్జీలు పరిష్కారమయ్యాయి. 8810 అర్జీలు పరిష్కార దిశలో ఉన్నాయి.5728 అర్జీలు పరిశీలనలో ఉన్నాయి. 5728 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. శాఖల వారీగా అర్జీలను పరిశీలిస్తే రెవెన్యూకు సంబంధించి 12334, సంక్షేమ శాఖకు 7373, వ్యవసాయ శాఖకు 249, వ్యక్తిగత అభివృద్ధికి 2748, విద్యాశాఖకు 430, ఇంజనీరింగ్ శాఖకు 488, పరిశ్రమల శాఖకు 141, వైద్య ఆరోగ్యశాఖకు 182, ప్రాజెక్టులకు 297, పంచాయతీరాజ్‌కి 296అర్జీలు వచ్చాయి.
ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్
ప్రజాదర్బార్‌లో అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. సమస్య పరిష్కారంపై సరైన సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.