ఓటరుగా నమోదుకు చివరి అవకాశం: భన్వర్‌లాల్
ఓటర్ల జాబితాలో చేరి ఐదు ఎన్నికల్లో ఓటు వేయండి
రాష్ట్ర ప్రజలకు సీఈవో భన్వర్‌లాల్ పిలుపు
నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో నమోదుకు ఏర్పాట్లు
జాబితాలో పేరు లేకుంటే అక్కడే దరఖాస్తు చేయండి
ఈ ఎన్నికల్లో 2 లక్షల కొత్త ఈవీఎంల వినియోగం
సామూహిక రైల్వే రిజర్వేషన్లపై నిఘా... రైల్వేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటరుగా పేరు నమోదుకు ఇదే చివరి అవకాశం... దీన్ని వినియోగించుకొని ఐదు ఎన్నికల్లో ఓటు వేయండి’ ఈ నినాదంతో ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలతో పాటు బూత్ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రతి ఒక్కరూ బూత్‌స్థాయి అధికారుల వద్ద గల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి.
పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోండి. మార్చి 20 కల్లా ఓటర్ల జాబితాల్లో ఆ పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఓటరుగా నమోదైతే ఎన్నికలు పూర్తయ్యే వరకు తొలగించడానికి వీల్లేదు. ఓటుహక్కు పొందితే వరుసగా మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఐదు ఓట్లు వేయవచ్చు. గుర్తింపు కార్డు ఉంటే జాబితాలో పేరు ఉంటుందనుకోవద్దు. పొరపాటునో లేక ఇతర కారణాల వల్లో పేరు తొలగిస్తే గుర్తింపు కార్డు ఉన్నా ఓటుహక్కు రాదు. అందుకే ప్రతి ఒక్కరు ఆదివారం జాబితాను పరిశీలించండి. ఓటుహక్కు తప్పనిసరిగా పొందండి’’ అని కోరారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున ఓటుహక్కు వస్తుందనే నమ్మకం ఉండదన్నారు. ఆయన వెల్లడించిన వివరాలివీ...
- నియమావళి అమల్లో భాగంగా నగదు, మద్యం పంపిణీని నిరోధించేందుకు అసెంబ్లీ స్థానానికి మూడేసి చొప్పున 1,800 చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌స్క్వాడ్స్.
- కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం (నాన్‌డ్యూటీ పెయిడ్) నిరోధానికి సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేకంగా నిఘా.
- ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి నక్సల్స్ రాకుండా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా.
- రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నూతన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం. సోమవారం నుంచి తొలి దశ తనిఖీలు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటి తనిఖీలు జరుగుతాయి. ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను పార్టీల ప్రతినిధుల సమక్షంలో 1,500 ఓట్లు వేసి తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియను చిత్రీకరిస్తారు. ఎవరైనా కావాలని అడిగితే ఆ వీడియో సీడీ ఇస్తారు. రెండో దశ తనిఖీలూ వంద ఓట్లతో చేస్తారు. తనిఖీల తర్వాత సంతృప్తి వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సంతకాలు తీసుకుంటారు. ఇదంతా నెలాఖరుకల్లా పూర్తి.
- ఎన్నికల ఏర్పాట్లు, నియమావళి అమలుపై 13నజూబ్లీహాల్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో కేంద్ర డెప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి భేటీ.
- ఈ నెల 19న కమిషన్ డెరైక్టర్ జనరల్ అక్షయ రావత్ పారిశ్రామిక సంస్థలు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా అవగాహన సదస్సు నిర్వహిస్తారు.
- ఎన్నికల తేదీకి ముందు ప్రధానంగా హైదరాబాద్ జంటనగరాల్లో ఉంటున్నవారు సొంత ఊర్లకు వచ్చి ఓట్లు వేసేందుకు వీలుగా కొందరు అభ్యర్థులు చేయిస్తున్న సామూహిక రిజర్వేషన్ల నిరోధానికి నిఘా కోసం రైల్వే అధికారులకు లేఖ రాస్తారు.
- సభలు, ర్యాలీలు, ప్రచారాల వ్యయం ఆయా పార్టీల ఖాతాల్లోకి వస్తుంది.
- నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఖాతాలోకి ప్రచారం వ్యయం వెళ్తుంది. అయితే ఈలోగా అభ్యర్థి ఎవరైనా రాజకీయ పార్టీల సభల్లో వినియోగించిన ప్రచార సామాగ్రినే నామినేషన్ దాఖలు తరువాత కూడా వినియోగిస్తే ఆ వ్యయం అభ్యర్థి ఖాతాలోకి వెళ్తుంది.
- ఎన్నికల ప్రచార సరళిని పూర్తిగా వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు.