పాపం కాంగ్రెస్ నేతలు
Published Wed, Oct 16 2013 4:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కాంగ్రెస్ పార్టీ... వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. తెలుగుదేశం ప్రభంజనంలో కొట్టుకుపోయిన తరువాత మహానేత వైఎస్ పుణ్యమాని దానికి కొత్త బలం చేకూరింది. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఓ ఊపు ఊపింది. ఆ నాయకుని హయాంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే గొప్ప గౌరవంగా భావించేవారు. మహానేత పరమపదించాక దిక్కులేనిదైన పార్టీ పరిస్థితి సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో దయనీయంగా మారిది. ఇప్పుడు ఆ పార్టీకి చాలావరకూ నియోజకవర్గ ఇన్‌చార్జిలే లేరు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ అభ్యర్థులు జల్లెడ వేసినా కనపడటం లేదు. ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేందుకు సైతం భయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా ఎంపీలు, మంత్రులకు అనేక చేదు అనుభవాలు అనునిత్యం ఎదురవుతుండటంతో ముఖం చాటేయాల్సివస్తోంది. ఈపరిస్థితులను అధిగమించేం దుకుగానీ, జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించేందుకుగానీ పార్టీ పరంగా ఎటువంటి ప్రయత్నాలు జరగకపోవడంతో కార్యకర్తలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఎంపీ రాయపాటి పార్టీలోనే కొనసాగుతున్నా ఏ క్షణాన్నైనా గుడ్‌బై చెప్పేయొచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రేపల్లె నుంచి ప్రాతి నిధ్యం వహించిన మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సోదరుడు మోపిదేవి హరనాథ్‌బాబు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. దీనితో అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. ప్రస్తుతం మోపిదేవి శ్రీనివాస్, దేవినేని మల్లిఖార్జున రావులు పార్టీ కార్యకర్తలను క్రోడీకరించే పనిలో ఉన్నారు. సహకార శాఖమంత్రి కాసు కృష్ణారెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీశీలం పదవులను వీడలేదు సరికదా జిల్లాలో ఏ కార్యక్రమాలకూ హాజరుకావడంలేదు.
రాయపాటి భవితవ్యంపైనే చర్చ
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోలేనని, త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెబుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు స్నేహితుడని ఒకసారి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కొత్తపార్టీ ఆవిర్భవించనున్నదని మరోసారి ప్రకటనలు చేయడంతో ఆయన ఆనుచరులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అనుసరించకుండా కొంతమంది ఇతర పార్టీల్లో చేరే యత్నంలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న రాయపాటి ఒక్కసారిగా దూరం కావడంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీచేసిన వల్లభనేని బాలశౌరి మూడు రోజుల క్రితం వైఎస్సార్ సీపీలో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బాలశౌరిని అనుసరిస్తున్నారు. దీనితో అనేక నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరుఫున మారుపూడి లీలాధర్‌రావు పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. కొంతకాలానికి మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పార్టీ నియమించింది.
కార్యకర్తలు చెదిరిపోకుండా కొంతమందికి నామినేటెడ్ పదవులను ఇచ్చినప్పటికీ, మిగిలిన ముఖ్యనేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. గురజాల నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో గుంటూరుకు చెందిన వైద్యుడు ఆళ్ల వెంకటేశ్వర్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ సి.జి.వి.కృష్ణారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారే కాని పార్టీ పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. వేమూరు నుంచి కాంగెస్ అభ్యర్ధిగా పోటీచేసిన మేరుగ నాగార్జున వైఎస్సార్‌సీపీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీని నడిపించే వారే లేకుండా పోయారు. ఇక తాడికొండ, గుంటూరు -2 నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణలు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలో పార్టీకి పూర్తి బాధ్యులుగా నిలిచిన వీరు రాష్ట్ర విభజన కారణంగా కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండకుండా ఎక్కువగా రాజధానికే పరిమితం అవుతున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్ దయనీయ స్థితి పార్టీ సానుభూతిపరుల్ని నిరాశానిస్పృహల్లోకి నెట్టేస్తోంది.
Advertisement