
న్యాయవాది ఇంట్లో 40 సవర్ల నగలు చోరీ
నగరంలోని సంతపేటలో ఉంటున్న ఓ న్యాయవాది ఇంట్లో బుధవారం పట్టపగలు దొంగలు పడ్డారు. సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.
నగరంలో విస్తృత తనిఖీలు
నెల్లూరు (క్రైమ్): నగరంలోని సంతపేటలో ఉంటున్న ఓ న్యాయవాది ఇంట్లో బుధవారం పట్టపగలు దొంగలు పడ్డారు. సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. సంతపేటలోని బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న ముడంతస్తుల భవనంలో కింద పోర్షన్‌లో జి.రఘుపతి వెంక ట సుమన్‌బాబు, పద్మజ దంపతులు నివాసం ఉంటున్నారు. పైపోర్షన్లు అద్దెకు ఇచ్చారు. సుమన్‌బాబు చిన్నబజారులో గుప్తా సిల్వర్ ప్యాలస్ నిర్వహిస్తుండగా, పద్మజ న్యాయవాదిగా పనిచేస్తోంది.
ప్రతి రోజు సుమన్‌బాబు ఉదయం 8 గంటల కు దుకాణంకు వెళ్లేవాడు. పద్మజ ఉద యం 10 గంటలకు కోర్టుకు వెళుతుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కోర్టు నుంచి పద్మజ ఇంటికి వచ్చేసరికి ఇంటి గేటుకు వేసి న తాళం, ఇంటి గ్రిల్స్‌కు వేసిన తాళం కిందపడి ఉన్నాయి. ఇంటి తలుపులు తెరిచి లోనికి వెళ్లిచూడగా పడ క గదుల్లోని బీరువాలు, అల్మారాలు తెర చి ఉన్నాయి. అందులోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంటి వెనుక వైపున తలుపు తెరచి ఉంది.
దీంతో అనుమానం వచ్చిన పద్మజ జరిగిన విషయాన్ని భర్తకు తెలిపింది. ఆయన ఇంటికి చేరుకుని మూడో నగర పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ ఎస్.మగ్బుల్, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే బాజీజాన్‌సైదా, మూడో నగర ఎస్‌ఐలు నాగభూషణం, నాగేశ్వరరావు, క్లూస్‌టీం ఇన్‌స్పెక్టర్ శివారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. సంఘటన జరిగిన తీరును డీఎస్పీ బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని వెళ్లారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడో నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
సంఘటన స్థలంలో నిందితుడి షూ
సంఘటన జరిగిన తీరు పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. వెనుక వైపు తలుపు వద్ద దుండగులు షూ వదిలి వెళా ్లరు. దుండగులు ఇంటి వెనుక వైపు నుంచి వచ్చి ఉంటే ముందు వైపు తలుపులుకున్న తాళాలు పగులగొట్టాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి దుండగులు పోలీసులను, బాధితులను తప్పుదోవ పట్టించేందుకే సంఘటన స్థలంలో షూ వదిలివెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బాధితులు పడకగదిలోని బీరువా తాళాలను బీరువాకే పెట్టి వెళ్లడంతో దొంగలు సులువుగా తమ పనికానిచ్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
చోరీ ఘటనపై డీఎస్పీ ఆగ్రహం
చోరీ ఘటనపై నగర డీఎస్పీ ఎస్. మగ్బుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే దొంగలు ఇల్లు కొల్లగొడుతుంటే ఏం చేస్తున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డాడు. క్రైం బీట్, ఐడీ పార్టీ, రక్షక్, బ్లూకోట్స్ ఏమైయ్యారు? ఎక్కడున్నారు అంటూ నిలదీశారు. అనుమానాస్పద వ్యక్తులను, పాత నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల వద్ద నిఘా ఉంచాలన్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. దీంతో నగర పోలీసులు బుధవారం సాయంత్రం నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. చోరీ ఘటనలో మూడో నగర అధికారులు, సిబ్బందికి ఆయన మెమోలు ఇచ్చారు.