
సాక్షి, విజయవాడ: మద్యం నిర్మూలనకు లఘు చిత్రాలు, పోస్టర్లతో ప్రచారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు కేంద్రంగా మద్య విమోచన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. మద్య నిషేధంపై అవగాహన కలిగించేందుకు డ్వాక్రా సంఘాలు, వలంటీర్ల సహాయం తీసుకుంటామన్నారు. వ్యసనపరులను గుర్తించి డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి మద్యం మాన్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే మద్యం మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై ఒక పాఠం ఉండేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.