ప్రజలు ఎన్నుకున్న నాయకులు పదవులు వచ్చాక ఆ ప్రజలనే పట్టించుకోవడం మానేస్తే.. ఇన్నాళ్లూ పోనీలే అని వదిలేసిన జనం ఇప్పుడు వాళ్ల కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి వచ్చింది. కొందరి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. ‘నాయకులూ..
సాక్షి, ఏలూరు:ప్రజలు ఎన్నుకున్న నాయకులు పదవులు వచ్చాక ఆ ప్రజలనే పట్టించుకోవడం మానేస్తే.. ఇన్నాళ్లూ పోనీలే అని వదిలేసిన జనం ఇప్పుడు వాళ్ల కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి వచ్చింది. కొందరి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. ‘నాయకులూ.. మీరున్నా లేకున్నా తెలుగుజాతిని కాపాడుకోవడానికి మేమే యుద్ధం చేస్తా’మంటూ సమైక్య సమరశంఖం పూరించారు. ఒ క రోజు కాదు రెండు రోజులు కాదు రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకునేవరకూ ఉద్యమం ఆగదని ప్రతినబూనారు. వారి అకుంఠిత దీక్షకు.. అవిరళ కృషికి, ఉద్యమ స్ఫూర్తికి కాకలు తిరిగిన రాజకీయ నాయకులు సైతం తలవంచక తప్పటం లేదు. ప్రజా ఉద్యమంలో భాగస్వాములుకాకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఇళ్లు వదిలి.. హంగు, ఆర్భాటాలను పక్కనపెట్టి సాదాసీదాగా జనం మధ్యకు వస్తున్నారు.
తలవంచక తప్పక...
సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలకు చేరువై మంత్రి పదవి రాగానే మాటమార్చిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వంటివారు ప్రజల ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. కానీ.. జిల్లాలో తిరగాల్సిన నాయకులు మాత్రం ప్రజల్లోకి వెళ్లాలంటే ఉద్యమంలోకి అడుగుపెట్టక తప్పదని గ్రహించారు. విభజిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత కూడా పదవులకు రాజీనామా చేసి నిరసన తెల పని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను సమైక్యవాదులు నేటికీ ముట్టడిస్తూనే ఉన్నారు. పదవుల కోసం ప్రాకులాడకుండా ప్రజల్లోకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించమని డిమాండ్ చేస్తున్నారు. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారెవరూ పదవుల్ని వదలలేదు. ప్రకటన వెలువడగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవుల్ని తృణప్రాయంగా వదిలి సమైక్య ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. ఉద్యమం క్షణక్షణం ఉధృత రూపం దాలుస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు కంటిమీద కునుకు కరువైంది. అడుగడుగునా వారికి ఉద్య మ సెగ తగులుతోంది.
ఇళ్లల్లో ఉంటే సమైక్యవాదులు ముట్టడిస్తున్నారు. బయటకు వస్తే కార్లకు అడ్డంగా పడుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఉద్యమంలోకి వస్తున్నారు. విభజన ప్రకటన వెలువడిన రెండు రోజులకు నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణు కు ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పలేదు. వీరిలో కొందరు రాజీ నామా లేఖలను స్పీకర్‌కు కాకుండా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఇచ్చారు. మూడు రోజులకు ఉండి, నిడదవోలు ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, నాలుగు రోజులకు కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి మాగంటి బాబు, అంబికా కృష్ణ మూడు రోజులుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. సమైక్యవాదులు ఘెరావ్ చేయడంతో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గురువారం బైక్ ర్యాలీ జరిపారు.