జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్‌లో రూ.లక్షలు విలువ చేసే చెట్లు మాయం పట్ట్టించుకోని అధికారులు
భూ ఆక్రమణలు జరుగుతున్నా కళ్లు మూసుకుంటున్న వైనం
కిటికీలు, ద్వారబంధాలు పోతే పోలీసులకు ఫిర్యాదుచేసిన అధికారులు మాయమైన కంటైనర్, జీఐ పైపులపై విచారణ ఎందుకు చేపట్టరు?
జంఝావతి జలాశయ పథకం ఇంజినీరింగ్ విభాగంలో కొందరు సర్వభక్షకులుగా మారారు. రబ్బర్‌డ్యామ్‌కు చెందిన సామగ్రిని, కంటైనర్, ఐజీ పైపులు, పాడైన గృహాల కిటికీలు, ద్వార బంధాలు ఇలా ఒకటేమిటి దొరినవాటిని దొరికినట్టు చుట్టేసిన వారు.. చెట్లను కూడా భక్షించారని సమాచారం. దీంతో పాటు భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు కళ్లుమూసుకుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వెనుక రాజకీయ నేతల హస్తం కూడా ఉంది.
పార్వతీపురం, న్యూస్‌లైన్: జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్‌లో వేలాది రూపాయల విలువైన చింత, మామిడి, కొబ్బరి, సపోటా చెట్లు మాయమయ్యాయి. సుమారు 30 ఏళ్ల క్రితం వేసిన చె ట్లను జేసీబీతో కూల్చి మాయం చేసినట్టు తెలిసింది. అయినా ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ అధికారి అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్లు కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు, ఉన్నతాధికారుల మద్దతు ఉండడడం వల్లే ఇంత ధైర్యంగా ఒక్కొక్కటీ మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో రబ్బరు డ్యామ్ నిర్మా ణం కోసం ఆస్ట్రియా శాస్త్రవేత్తలు వినియోగించిన సుమారు రూ. 40 లక్షల విలువచేసే కంటైనర్, జీఐ పైపులు 2013 జూలైలో మాయమైనా ఇంతవరకూ శాఖాపరంగా ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీంతో ఏంచేసినా పరవాలేదులే అన్న ధీమాకు అక్కడి సిబ్బంది చేరుకున్నారు. అందినకాడికి దోచుకోడానికి అలవాటుపడ్డారు. కొంతమంది ఇంటి దొంగలే దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. అంతేకుండా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి గత కొన్నేళ్లుగా అవినీతి రాజ్యమేలుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
2010లో జంఝావతి కాలువల్లో పూడికలు తీయకుండా నే పనులు జరిగినట్లు రూ. 50 లక్షలు డ్రా చేశారు. వీటికి సంబంధించిన మెజర్‌మెంటు బుక్‌లను అప్పట్లో డీఈఈగా పనిచేసిన వ్యక్తి మాయం చేశారు. దీనిపై కేసు నడుస్తున్నప్పటికీ నేటికీ విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 1975లో జంఝావతి డ్యాం నిర్మాణం కోసం వినియోగించే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోసేందు కు సుమారు అర ఎకరా స్థలంలో పెట్రోల్ బంకును ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ స్థలం కూడా ఆక్రమణలకు గురయ్యింది. దీని వెనుక పర్యవేక్షణాధికారి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. తవ్వుకుంటూ పోతే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత జరిగినా పట్టించుకోని పర్యవేక్షణాధికారి ఈ కార్యాలయానికి సంబంధించి తలుపులు, ద్వార బందాలు పోయినట్లు మాత్రం కొమరాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాని లక్షల రూపాయలు విలుచేసే సామగ్రి దొంగల పాలైనా ఇటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గానీ, శాఖాపరమైన దర్యాప్తు గానీ చేయకపోవడం విచారకరం. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చెట్లు మాయం కాలేదు
ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో చెట్లు మాయంపై వివరణ కోరగా అటువంటిదేమీ లేదని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఒక చెట్టు పడిపోయింది తప్ప, ఎవరూ చెట్లను నరికి తీసుకుపోలే దని చెప్పారు.
వారు....సర్వ భక్షకులు!
Published Sat, Feb 1 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement