చెల్లెమ్మ ‘కార్తీక’ నోము...
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయుడు కార్తీక్‌రెడ్డిని ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం టికెట్ తృటిలో తప్పిపోవడంతో ఈసారి ఎలాగైనా పోటీ చేయాలనే కృతనిశ్చయంతో కార్తీక్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేరుతో చేవెళ్ల సెగ్మెంట్‌లో పాదయాత్ర నిర్వహించారు. సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డి ఈసారి పోటీచేయకపోతే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఏఐసీసీ దూతను కోరారు. ఇక సబితమ్మ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ ‘మర్రి’ మార్క్...
జిల్లా రాజకీయాలపై పట్టు సాధించాలని మర్రి కుటుంబం భావిస్తోంది. ఎన్‌డీఆర్ ఎఫ్ వైస్ చైర్మన్‌గా సోనియాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న మర్రి శశిధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని తెరమీదకు తేవాలని నిర్ణయించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పెద్ద కుమారుడు ఆదిత్యను పోరులోకి దింపాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన కుటుంబం... సీనియర్ల మద్దతు కూడగట్టే యత్నం చేస్తోంది.
సీఎం పదవి రేసులో ఉన్న మర్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్ నుంచి మళ్లీ పోటీచేయాలని యోచిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తే మాత్రం శశిధర్‌రెడ్డే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి తలపడే అవకాశముంది. మరోవైపు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వీరికి సమీప బంధువు కావడం విశేషం.
‘పట్నం’ చెట్టపట్టాల్!
తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ఈసారి తన భార్య సునీతను కూడా ఎన్నికల్లో నిలపాలని యోచిస్తున్నారు. పార్లమెంట్‌కు తాను.. శాసనసభకు తన సతీమణిని బరిలో దింపాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ సీట్లపై కన్నేసిన మహేందర్...బీజేపీ పొత్తుతో పార్లమెంటులోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం నుంచి సునీతను పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం తరఫున ఎన్నికల సమరానికి సై అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదివరకే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరుణంలో నరేందర్ పోటీ ఖరారైనట్టే!
‘వీరు’డొచ్చాడు!
రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు వీరేందర్‌ను ప్రకటించారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మేడ్చల్‌లోని అంతర్భాగమైన ఉప్పల్ నియోజకవర్గం నుంచి వీరేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. టీడీపీ బలంగా ఉండటం, పాత పరిచయాలు కలిసివస్తాయని అంచనా వేసిన గౌడ్‌సాబ్... తన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఉప్పల్‌కే కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌లో విస్తృతంగా పర్యటిస్తున్న వీరేందర్ ఈసారి ప్రత్యక్షంగా కదనరంగంలోకి దూకేందుకు పావులు కదుపుతున్నారు.
మామ ఇక్కడ.. అల్లుడక్కడ!
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ ఎస్.జైపాల్‌రెడ్డి అల్లుడు రేవంత్‌రెడ్డి టీడీపీ తరఫున మల్కాజిగిరి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్.. తెలంగాణవాదం నేపథ్యంలో అక్కడ గెలుపు కష్టమేననే అంచనాకొచ్చారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరిపై కన్నేశారు. మామ జైపాల్‌రెడ్డితో తీవ్ర అభిప్రాయ భేదాలున్న రేవంత్... పార్లమెంటులో ప్రవేశించడం ద్వారా ఆయనకు సవాల్ విసరాలని భావిస్తున్నారు. అయితే, రేవంత్ అభ్యర్థిత్వంపై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరికొందరు ఆశావహులు వీరే...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మరోసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. వయోభారం దృష్ట్యా తనను కాదనుకుంటే కుమారుడు శ్రీనివాసరెడ్డికి సీటు దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమేశ్‌కు ఈయన బాబాయి. వీరిలో ఎవరో ఒకరే బరిలో ఉండాలని భావిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి వచ్చే ఎలక్షన్లలో యాకుత్‌పురా నుంచి పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు.
ఉప్పల్ శాసనసభ్యుడు బండారి రాజిరెడ్డి వయోభారం దృష్ట్యా రాజకీయాల నుంచి విరమించుకుంటే.. పొటీ చేసేందుకు వెనుకాడకూడదని సోదరుడు లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు.
పాలి‘ట్రిక్స్’... ఫ్యామిలీ ‘ప్యాక్స్’!
Published Sun, Jan 26 2014 12:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement