సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఒకనాడు పార్టీలో ఉండి, బయటకు వెళ్లిన నాయకులను తిరిగి రప్పించి, జిల్లాలో బలం పుంజుకోవాలన్న తెలుగుదేశం ఆశలు కొడిగట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండి, తిరిగి సొంతగూటికి వస్తారనుకున్న పలువురు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారనే సంకేతాలు జిల్లాలో గత వైభవాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్న టీడీపీ నాయ కత్వానికి మింగుడు పడడం లేదు. పార్టీ లో ని ఆశావహులను పక్కనబెట్టి, ప్రస్తు తం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి, ఎన్నికల ఖర్చులు ఇచ్చే ప్యాకేజీని ఎర వేసింది.
స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడే రంగంలోకి దిగి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. పుట్టి మునిగిపోతున్న కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ‘సైకిల్’ ఎక్కేందుకు వారు సానుకూల సంకేతాలు పంపించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్‌లో ఉంటే ఎంత నష్టమో టీడీపీకి వెళ్లినా అంతే నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు.
వెళ్లినా ఒరిగేది సున్న..!
రాష్ట్ర విభజన నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఈ విషయాన్ని రాజమం డ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పకనే చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రజాదరణ మెండుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలనుకున్నారు. తీరా అక్కడ బెర్త్‌లు ఖాళీ లేకపోవడం, పాత మిత్రులను సొంతగూటికి తెచ్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేయడంతో అటువైపు అడుగులు వేయాలనుకున్నారు. ఆ జాబితాలో కొత్తపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు, వంగా గీత, పంతం గాంధీమోహన్ ఉన్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది.
కాంగ్రెస్ నుంచే పోటీ అన్న మంత్రి తోట
జిల్లాకు చెందిన మంత్రి తోట నరసింహం కూడా టీడీపీకి వెళతారనే ప్రచారం జరిగింది. ఆయన జగ్గంపేట నుంచి పోటీ చేసి, భార్య వాణిని కాకినాడ పార్లమెంటు లేదా కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయిస్తారని పార్టీవర్గాల్లో చర్చ నడిచింది. అయితే టీడీపీలో చేరినా ఒరిగేదేమీ లేదని చెబుతున్న సర్వే నివేదికలతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి వలసవెళ్లే విషయంపై పునరాలోచనలో పడ్డారని అనుచర వర్గం చెబుతోంది.
మంత్రి తోట తాను కాంగ్రెస్ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అదీ కూడా జగ్గంపేట నుంచేనని సోమవారం జగ్గంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. ముందు తోట చూపు టీడీపీ వైపు మళ్లినా అక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితే ఉందనే ఉద్దేశంతోనే ఆయన వెనకడుగువేశారంటున్నారు. దాదాపు ఇదే అభిప్రాయంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారు.
విభజనపై రెండు కళ్ల సిద్ధాం తాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు వైఖరి జిల్లాలో టీడీపీ నేతలకే మింగుడుపడనప్పు డు తమ ఎమ్మెల్యేలు ఎలా సాహసం చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతు న్నాయి. టీడీపీకి ఆదరణ ఉ న్నప్పుడే బయటకు వచ్చేసి, ఇప్పుడు పుట్టిమునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు అదే పార్టీలోకి తిరిగి వెళ్లడమెందుకని అనుచరవర్గం ఎమ్మెల్యేల వద్ద పోరు పెడుతోంది. అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే వరకు వేచిచూద్దామని ఎమ్మెల్యేలను ముఖ్యనేతలు వెనక్కు లాగుతున్నారని తెలిసింది.
‘సైకిల్’ ఎక్కినా ‘దిగ’జారుడే..
Published Tue, Jan 14 2014 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement