గూడూరు: గూడూరు మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది. డబ్బులిస్తే చాలు బతికున్న వాళ్లు సైతం మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తారు. అందుకు గోల్కొండ జనార్దన్‌సింగే ఉదంతమే నిదర్శనం. ఇతను బతికి ఉండగానే మున్సిపల్ అధికారులు మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని మీ-సేవా ద్వారా ఇచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని నలజాలమ్మవీధికి చెందిన జనార్దన్‌సింగ్ మూడేళ్ల నుంచి రూరల్ పరిధిలోని చెన్నూరులో నివాసముంటున్నాడు. రెండో పట్టణంలోని ఇందిరానగర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న అతను మృతిచెందాడని ఓ వ్యక్తి గత నవంబరు 10న మున్సిపల్ కార్యాలయంలో ధ్రువీకరణపత్రం కోసం దరఖాస్తు చేశాడు. సాధారణంగా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసేందుకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి. అయితే మున్సిపల్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని ధృవీకరణపత్రాన్ని ఈ సంవత్సరం జనవరి 13న జారీ చేశారు.
వాటాల్లో తేడావచ్చి..
మున్సిపల్ అధికారులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య ముడుపుల పంపకం విషయంలో విభేదాలు తలెత్తడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఈ విషయాన్ని జనార్దన్‌సింగ్‌కు చేరవేశారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఉద్యోగుల ద్వారానే ఆ మరణ ధృవీకరణపత్ర నకలను తీసుకున్నారు. తాను బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని తనకు ఎలా మంజూరు చేస్తారని మున్సిపల్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జనార్దన్‌సింగ్ తెలిపారు.
గూడూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది సంపాదనే ధ్యేయంగా ఉన్నారు. ధృవీకరణ పత్రాల మంజూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు కమిషనర్‌కు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బులిస్తే కార్యాలయంలో ఏ పనైనా నిమిషాల్లో జరిగిపోతోంది. డబ్బు లేకుండా పనిచేయించుకోవాలంటే రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. కార్యాలయం సిబ్బంది ముడుపులు చెల్లిస్తే కార్యాలయంలోని రికార్డులను తారుమారు చేయగలరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నే బతికే ఉన్నా..
Published Sun, Jul 5 2015 2:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement