సాక్షి, ఖమ్మం: పన్నుల వసూళ్లు లేక.. ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు రాక మున్సిపాలిటీలను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. నాలుగేళ్లలో మున్సిపాలిటీలు, ఆర్నెల్లలో ఖమ్మం కార్పొరేషన్ బకాయిలు మొత్తం రూ.15.62 కోట్ల మేర పేరుకుపోయాయి. ఇటీవల ప్రభుత్వం బకాయిలు వసూలు చేయని మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది.
ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలకు ఆస్తి, నీటి కుళాయి పన్ను, ఆస్తి యాజమాన్యంపై పేరు మార్పిడి, భవన నిర్మాణ అనుమతులు, ప్లాట్ల లే అవుట్స్, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు, ట్రేడ్ లెసైన్స్‌లు.. తదితర వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. వీటితోనే పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు ఇవి ఆశించిన స్థాయిలో వస్తే ఏటా మున్సిపాలిటీల్లో పనులు వేగంగా జరుగుతాయి. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధులు ఆశించినస్థాయిలో రాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
వసూలు చేస్తున్న పన్నులు, వచ్చే ఆదాయం అంతా వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కార్యాలయాల నిర్వహణకే సరిపోతుంది. నాలుగేళ్లలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో రూ.11.62 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్నెల్లలోనే రూ.4 కోట్ల మేర పన్నుల వసూలు పెండింగ్‌లో ఉంది.
వసూళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం..
ప్రతి ఆర్నెల్లకోసారి మున్సిపల్ సిబ్బంది భవన యజమానుల నుంచి పన్నులు వసూలు చేయాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. బకాయిపడిన వారికి మున్సిపాలిటీల నుంచి ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ఇంటి యజమానుల బకాయిలు భారీగా పేరుకపోయినా అధికారులు మాత్రం నోటీసులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీలో నాలుగేళ్ల పాటు పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో దీని ప్రభావం పన్నుల వసూళ్లపై పడింది. బకాయిలు పడిన యాజమానులు.. సిబ్బంది, కొంతమంది అధికారుల చేయి తడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
దీనివల్లే భారీగా బకాయి పడిన యాజమాన్యాలపై సిబ్బంది కన్నెత్తి చూడడం లేదంటున్నారు. ఇటీవల ప్రభుత్వం బకాయిలపై కన్నెర్రజేసింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా.. ఏ మున్సిపాలిటీలోనూ పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించకపోవడం గమనార్హం.
అత్యధికంగా కొత్తగూడెం మున్సిపాలిటీలోనే రూ.7.76 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.
ఖమ్మం కార్పొరేషన్ విషయానికొస్తే ఆర్నెల్లలో రూ.7 కోట్లకు గాను రూ.3 కోట్లు వసూలు చేశారు. గత నాలుగేళ్లలో కార్పొరేషన్ పరిధిలో రూ.కోట్లలో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కొన్నేళ్లుగా పన్నుల చెల్లింపు లేకపోవడంతో ఈ బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి.
మున్సి‘పల్టీలు’
Published Sat, Oct 18 2014 1:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement