పన్నుభారం
* ఖమ్మం కార్పొరేషన్ వాసులపై ఇక ట్యాక్స్ మోత
* సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు కూడా
* త్వరలో ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
* ఆదాయం కోసమే అంటున్న సర్కారు
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలోభాగంగా పురవాసులకు వాత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆస్తి పన్ను పెంచితే ఖజానా గలగలలాడుతుందనే ఉద్దేశంతో భారం వేసేందుకు యత్నిస్తోంది. ఇదే జరిగితే తొలుత ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి, కార్పొరేషన్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సరిగా నిధులు రాకపోవడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు, జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌గా హోదా పెరిగి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు శివారు కాలనీల్లో మాత్రం సీసీరోడ్లు, డ్రైనేజీలతో పాటు మంచినీటి సరఫరా లేదు. ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారు తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
నిధుల లేమితో కార్పొరేషన్‌కు వచ్చే ఆస్తి, ఇతర పన్నులతోనే పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రభుత్వం తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న సాకుతో ఆస్తి పన్ను పెంచేందుకు సమాయత్తమవుతుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సౌకర్యాలు కల్పించకుండా పన్ను పెంచితే ఏలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల నగర పంచాయతీగా ఏర్పడిన మధిరలోనూ అభివృద్ధి పనులకు నిధుల లేమితో మోక్షం లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దండిగా విడుదల చేస్తే పన్ను పెంచాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇవేవీ చేయకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తప్పకుండా ఆస్తి పన్ను పెంచాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్తుండటం గమనార్హం.
ఖమ్మం వాసులకు భారమే
వీలిన గ్రామ పంచాయతీలతో కలిపి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 వేల వరకు నివాసిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో 10 వేలకు పైగా నాన్ రెసిడెన్షియల్ పరిధిలోకి వస్తాయి. కార్పొరేషన్‌ను నాలుగు జోన్లుగా విభజించి ఇప్పటి వరకు పన్ను వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.12.36 కోట్ల మేరకు ఆస్తి పన్ను రూపంలో కార్పొరేషన్‌కు ఆదాయం రావాలి. కానీ వాణిజ్య కేటగిరీకి సంబంధించి మొండి బకాయిలు ఉండడంతో ఏటా 50 శాతం పన్నుల వసూలు మించడంలేదు.
పేద, మధ్య తరగతి వర్గాలను ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్న అధికారులు.. వాణిజ్య, ఇతర సంపన్నవర్గాల నుంచి గృహ పన్నులను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనివల్లే బకాయిలు భారీగా పెరుకుపోతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం పన్ను పెంచడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకే ఇబ్బంది కలుగుతుంది. పన్ను వసూలుకు నివాస, వాణిజ్య, వ్యాపార సముదాయాలను 10 వినియోగ కేటగిరీలుగా విభజించారు.
దీని ప్రకారం ఆస్తి పన్ను వసూలు ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్‌లో ఒకటో జోన్‌లో నివాస వసతికి పక్కా భవనానికి చ.మీటర్‌కు ఏడాదికి రూ.19, సాధారణ భవనానికి రూ.16, పలకల కప్పుకు రూ. 11, పెంకు ఇల్లుకు రూ. 8, గడిసెకు రూ. 3 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వార్షిక అద్దె విలువ (వీఆర్‌వీ)ను ప్రామాణికంగా తీసుకొని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భవనాలు, ఖాళీ స్థలాల ఆస్తి పన్నుల గణన జరుపుతారు.
ఏప్రిల్ 1 నుంచి నగర పంచాయతీల్లో..
సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి పెంచిన ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. సత్తుపల్లి నగర పంచాయతీలో నివాస, వాణజ్య, వ్యాపార గృహాలు, సముదాయాలు 8 వేలు, మధిరలో 5 వేల వరకు ఉన్నాయి. వీటికి కూడా చదరపు మీటర్ చొప్పున ఆస్తి పన్ను పెంచి వసూలు చేస్తారు. ఇప్పటికే ఈ పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో శివారు కాలనీల్లో ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటోంది.
ఆస్తి పన్ను పెంచి వసూలుకు దిగితే ఆధికారులు, సిబ్బంది జనాగ్రహం చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహాల సంఖ్యను మళ్లీ గణన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులను త్వరలో ఆదేశించనున్నట్లు సమాచారం. ఈ గణన పూర్తి అయిన తర్వాత పాత మున్సిపాలిటీల్లోనూ పన్ను పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.