తల్లిని వదిలించుకున్నారు
కడుపున పుట్టిన బిడ్డలు ఏడిస్తే చలించిపోయే తల్లిని ముదిమి వయసులో చూసుకునే వారు కరువయ్యారు. అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు రోడ్డు పాలుచేసి చేతులు దులుపుకుంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో. ఈ ఘటన బి.కొత్తకోట మండలం శంకరాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది.
బి.కొత్తకోట: శంకరాపురంలోని ఒక మంగలి షాపు వద్ద 95 ఏళ్ల వృద్ధురాలు పడుకుని ఉంది. శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజ మాని ఆమె ఎవరో ఏమిటో తెలియకపోవడంతో ఎదురుగా ఉన్న చింతచెట్టు కిం దకు చేర్చాడు. అప్పటి వరకు ఆమె విషయాన్ని పట్టించుకోని గ్రామస్తులు తర్వాత వివరాల కోసం ఆరా తీశారు. చర్మం ముడతలు పడి, కూర్చునేందు కు, లేచేందుకూ వీలులేని స్థితిలో వృద్ధురాలు దీనంగా కనిపిస్తోంది. ఆమె చిరునామా కోసం ప్రయత్నిస్తే సమాధానం చెప్పలేకపోతోంది. ఒకసారి మాత్రం అనంతపురం జిల్లా తనకల్లు అని చెప్పింది. వినికిడి సమస్య ఉన్న ఆమె ఇంకేమీ చెప్పలేకపోతోంది.
వదిలేసి వెళ్లిపోయారు..
ములకలచెరువు నుంచి బి.కొత్తకోట మీదుగా కర్ణాటకలోని చింతామణికి వెళ్లే ప్రయివేటు బస్సులోంచి ఓ జంట గురువారం ఉదయం 10 గంటల సమయం లో శంకరాపురంలో వృద్ధురాలిని దించారని గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపక్కనే చాలా సమయం పడుకోబెట్టారని చె ప్పారు. స్థానికులు ప్రశ్నిస్తే శంకరయ్యస్వామి దర్శనం కోసం వచ్చామని సమాధానమిచ్చారు. సాధారణంగా స్వామి దర్శనానికి భక్తులు వస్తుంటా రు. వాళ్లనీ ఇలాగే భావించారు. ఆ తర్వాత కొంత సమయానికి ఆ జంట మాయమైంది. రెండు రోజులుగా ఆమె అక్కడే ఉంది. గురువారం, శుక్రవారం మంగలిషాపు మూసివేసి ఉండడం, శనివారం షాపు యజమాని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు ఎవరన్నది తెలియడం లేదు. చింతామణి బస్సులో రావడం చూస్తే ములకలచెరువు నుంచే తెచ్చినట్టు అర్థమవుతోంది. తిరుపతి వైపు నుంచి లేదా అనంతపురం వైపు నుంచి రైలులో ములకలచెరువు చేరుకుని అక్కడి నుంచి బస్సులో శంకరాపురంలో వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.