' కోరిక తీర్చాలంటూ లెక్చరర్ వేధింపులు'
కాకినాడ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి పోలీసులకు చిక్కాడు. అతనికి సహకరించిన నలుగురు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ఐడీఎల్ ఇంజినీరింగ్ కళాశాలలో కాకినాడకు చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో కాకినాడ శ్రీనగర్కు చెందిన వీరవల్లి సత్య వీరదీపక్ లెక్చరర్గా పని చేస్తున్నాడు.
అతడు కొంతకాలంగా విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతనికి బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు శ్రీనివాస్, మోతుపల్లి రోహిత్ మెహర్, విజయబాబు, వెంకటేష్ సహకరించారు. గత ఆదివారం ఆన్లైన్లో పరీక్ష రాసేందుకు విద్యార్థిని కళాశాలకు వెళ్లగా... తమకు సహకరించాలని, లేకుంటే కారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడతామని వీరంతా బెదిరించారు.
అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తామని, బ్లేడ్లతో దాడి చేస్తామని భయపెట్టారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని డెడ్లైన్ పెట్టారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ర్యాగింగ్ యాక్ట్ 354(ఎ), ఐపీసీ 506, 34 సెక్షన్ల కింద నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.