మాడుగుల, న్యూస్‌లైన్ : మీసేవ ద్వారా (ఆన్‌లైన్‌లో) భూ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో తమ ఉపాధి పోతుందని లెసైన్సులున్న దస్తావేజులేఖరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 700 మంది దస్తాలేఖరులున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్ విధానం వల్ల తమ కుటుంబాలకు జీవనోపాధి పోతుందని, ఉద్యోగాలు లేకపోయినా దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే అడంగల్, ఈసీలకు మీసేవలో పనులు జరగక అత్యవసర సమయాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
గతంలో సగటున ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకి పది నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆన్‌లైన్ పద్ధతి రావడంతో కనీసం ఒక్క డాక్యుమెంటు అవ్వడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. మీసేవ ద్వారా అడంగల్, ఈసీలు రిజిస్ట్రేషన్లు చేయించుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలని దస్తావేజులేఖరులు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మాడుగుల ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ పి.శంకరరావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలుంటే రిజిస్ట్రేషన్ చేసేవారమన్నారు.
ఇప్పుడు ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లుంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. ఈవిధంగా రైతులకు అడంగల్‌లో పేర్లు లేక ఆన్‌లైన్‌లో తమ పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు నమోదు కాక రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోతున్నారన్నారు.
ప్రభుత్వమే లెసైన్సులిచ్చింది
గతంలో ప్రభుత్వం దస్తావేజులు రాయడానికి లెసైన్సులిచ్చింది. దీంతో దస్తావేజులు రాసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్లు మీసేవకు అప్పగిస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మీసేవకు అప్పగిస్తే ఆందోళనకు దిగుతాం.
- కొసిరెడ్డి కృష్ణమూర్తి,
దస్తావేజులేఖరి, మాడుగుల.
రిజిస్ట్రేషన్లు అవ్వలేదు
పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లో పెట్టడానికి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు కావడం లేదు. ఈ పద్ధతి ద్వారా మా పనులవడం లేదు. అడంగల్‌లో చేర్చి ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంతో భూములను విక్రయించుకోలేకపోతున్నాం.
- మట్టా రాజేష్, మాడుగుల.
లేఖర్లలో ‘ఆన్‌లైన్’ అలజడి
Published Wed, Dec 25 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement