నిమ్మకాయ మింగి చిన్నారి మృతి
కశింకోట, దిష్టి తగలకుండా మంచంపై ఉంచిన నిమ్మకాయ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. గుండెలు పిండేసే ఈ సంఘటన విశాఖ జిల్లా కశింకోటలో సోమవారం జరిగింది. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల కనకేశ్వరరావుకు, కశింకోటకు చెందిన గోవాడ కొండమ్మ కుమార్తె వరలక్ష్మి దంపతులకు రోహన్‌సాయి (10నెలలు) కొడుకు.
కనకేశ్వరరావు సైన్యంలో పనిచేస్తూ జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్నాడు. వరలక్ష్మి అత్తవారింట ఉంటోంది. చిన్నారికి నలతగా ఉండడంతో వరలక్ష్మి పుట్టింటి వారు ఆదివారం సాయంత్రం ఆమెను, బాబును కశింకోట తీసుకువ చ్చారు. రోహన్ పడుకునే మంచంపై నిమ్మకాయను దిష్టిగా ఉంచారు. బాలుడు దానితో ఆడుతూ నోట్లో పెట్టుకుని మింగేశాడు. ఊపిరాడక బాధపడుతున్న చిన్నారిని వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.