ప్రకాశం జిల్లా చీరాలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన లక్ష్మీనారాయణ
రాజమహేంద్రవరం క్రైం/చీరాల రూరల్: మంగళవారం వేర్వేరు ఘటనల్లో లిఫ్ట్‌లు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనలో.. లక్ష్మీవారపు పేట చక్రవర్తి అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ కొంతకాలం క్రితం మరమ్మతుకు గురైంది. ఇది తెలియని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, కాల్ధారికి చెందిన యర్రంశెట్టి గంగరాజు (60) లిఫ్ట్ కదులుతుండగానే గేట్లు తెరుచుకోవడంతో లిఫ్ట్ ఆగి ఉందని లిఫ్ట్‌లోకి వెళ్లాడు. అక్కడ ఖాళీ ప్రదేశం ఉందన్న విషయం తెలియక కాలు పెట్టడంతో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి పూజారి..
అలాగే ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఘటనలో.. అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తు తల ఇరుక్కుపోవడంతో పూజారి మృతి చెందాడు. పాపరాజుతోట ప్రాంతంలో వేమూరి లక్ష్మీనారాయణ (55), భారతి దంపతులు ఉంటున్నారు. లక్ష్మీనారాయణ.. మేనల్లుడి పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు మంగళవారం తన మేనకోడలు లీలారాణితో కలసి ఆంధ్రాబ్యాంకు సమీపంలోని శ్రీరంగ సదన్ అపార్టుమెంట్‌కు వెళ్లాడు. ఇద్దరూ మూడో అంతస్తులోని బంధువు శ్రీనివాసరావును కలిసేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మొదటి గేటు మూసి రెండో గేటు మూసే క్రమంలో లీలారాణి లిఫ్ట్ బటన్ నొక్కింది. దీంతో లిఫ్ట్ పైకి వెళ్లడంతో లక్ష్మీనారాయణ తల లిఫ్ట్ గేటుకు గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ వేగానికి తల ఛిద్రమై తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment