సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు): సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడింది. దీంతో ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖలోని పెదజాలారిపేటకు చెందిన అరిసిల్లి పోలిరాజు (19), పిల్లా సతీష్ (24), పిల్లా జగ్గారావు (25), వాడమొదుల లక్ష్మణ (30), తెడ్డు వెంకన్న (40), పిల్లా పరశురాం (20) ఆరుగురు మత్స్యకారులు గురువారం ఫైబర్ బోటుపై చేపల వేటకు వెళ్లారు. విశాఖ తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి వర్షం పడింది. ఈ క్రమంలో బోటుపై పిడుగు పడడంతో పోలిరాజు సముద్రంలోకి పడిపోయాడు. మిగిలిన మత్స్యకారులు గాయపడ్డారు. మధ్యాహ్నం వీరు సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఒక్కసారిగా మంటలు రావడంతో తమకు కళ్లు బైర్లు కమ్మి అసలు ఏం జరిగిందో తెలియలేదని ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు ‘సాక్షి’కి తెలిపారు. గాయపడిన సతీష్‌ను మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని ఏఎన్ బీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. సతీష్‌కు భార్య పి.రాణి, దీక్షిత (4), అలేఖ్య (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెదజాలారిపేటలో ఎదురుచూస్తున్న మత్స్యకార మహిళలు
పెదజాలారిపేటలో విషాదం
ఈ దుర్ఘటనతో పెదజాలారిపేటలో విషాదం నెలకొంది. పోలిరాజు తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆమె భర్త తాతాలు 16 సంవత్సరాల క్రితం చనిపోగా, ఇద్దరు కుమారులలో ఒకడైన పోలిరాజు గల్లంతవడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. స్థానిక మత్స్యకార మహిళలు ఆమెను ఓదార్చుతున్నారు. మరోవైపు పోలిరాజు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పరామర్శించారు. ఆర్థికసాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు సతీశ్
Comments
Please login to add a commentAdd a comment