అన్ని పథకాలకూ ఆధార్ లింకు
సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశం
హైదరాబాద్: అన్ని ప్రభుత్వ పథకాలకు శల వారీగా ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత హాస్టళ్లలో విద్యార్థుల చేరికకు, అలాగే విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికకు ఆధార్ అనుసంధానాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
అలాగే రెవెన్యూ రికార్డులకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. అధార్ అనుసంధానం చేయడం ద్వారా పథకాల భారాన్ని తగ్గించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం ద్వారా రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో ఈ-గవర్నెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించారు.