చిత్తూరు(గిరింపేట): బడుగు బలహీన వర్గాలకు అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మెసానికల్ మైదానం వద్ద గల అంబేడ్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ మనిషిని మనిషిగానే చూడండి అని చాటిచెప్పిన మహానుభావుడు అంబేడ్కర్ అన్నారు. ప్రతి దళితుడూ సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి మాట్లాడుతూ దళితులందరూ ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు.
అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని పేర్కొన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వకుండా ఇళ్లు మంజూరు చేస్తే వారు ఎక్కడ కట్టుకోవాలని నిలదీశారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. జూన్ లోపు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ డెరైక్టర్ వైవీరాజేశ్వరి, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్‌వో విజయచందర్, సోషల్ వెల్ఫేర్ జేడీ విజయకుమార్, డీఆర్‌డీఎ పీడీ రవిప్రకాష్, ఆర్‌డీవో కోదందరామిరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖాధికారులు, దళిత నాయకులు పాల్గొన్నారు.