
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నివసిస్తే జీవిత కాలం 20 ఏళ్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ నగరంలోనూ లేనివిధంగా ఇక్కడ జలం, పచ్చదనం ఉన్నాయన్నారు . ‘అమరావతి డీప్ డైవ్’ పేరుతో విజయవాడలోని ఓ హోటల్‌లో సీఆర్‌డీఏ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి నగరం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు.
గోదావరి జలాలతో సస్యశ్యామలం
గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చంద్ర బాబు అన్నారు. శుక్రవారం సచివాలయంలో గోదావరి– పెన్నా నదుల అనుసంధానంపై ‘వ్యాప్కోస్’ ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడంతో పాటుగా పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయవచ్చునని సీఎం చెప్పారు. అనుసంధానానికి రూ.80 వేల కోట్ల వ్యయమవుతుందన్నారు. కాగా, చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవులు వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు వారు విహారయాత్ర నిమిత్తం మాల్దీవుల్లో పర్యటిస్తారు.